పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్‌చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

౨౩

పరిశుద్ధమైనది గావచ్చును. కాని యిాజలమందు దేవుడు సూదిని జారవిడుచుటచేసి, నా బ్రహ్మజ్ఞానమును అతడు ఛేదించినాడని యర్థము. కావున వేగ మాతనికడకేగి, లోన ప్రవేశ పెట్టుము" అని పల్కెను.

"నాగార్జునుని, రూపము, దృష్టియు, మనసును మిక్కిలి గంభీరమైనవి. చూపరులకాతడు భయము నాశ్చర్యము గొలుపుచుండును. అతని ప్రజ్ఞయు, పాండిత్యముకూడ నట్టివే. అతనితో వాదింపదలచి వచ్చినవారతని వాగ్ధాదాటికి నిల్వజాలక తమ యజ్ఞానమును వెల్లడించి శిష్యత్వము నంగీకరింతురు. దేవ బోధిసత్త్వుడీ మహనీయుని ప్రజ్ఞా విశేషములను వినియుండిన వాడగుటవలన నాతనితో వాదించి, తన సందియములను బాపుకొనదలచి వచ్చి యుండెను. ఇపు డాతడు నాగార్జునుని సమిాపింపబోవువేళ మిక్కిలి భీతచిత్తుడై తొట్రుపాటుతో నడువ నారంభించెను. అట్లు సోపానముల నెక్కి మొగసాలలు కడచి ప్రాంగణము దాటి సభామంటపమును భయ, వినయ, గౌరవ, సంభ్రమములు వెంటనంటి రాఁ బ్రవేశించెను. నాగార్జునితో వాద మారంభించునప్పుడు కొంత భయకంపితు డయ్యెను. కాని సాయంకాల మగుసరికి, గంభీరముగ తన వాదము నుపన్యసింప సాగెను. అంతట నాగార్జును డాతని వాదములను విని సంతుష్టాంతరంగుడై, "దేవా! నీ జ్ఞానమును, పాండిత్యము నపారమైనవి. నీ యనుభవము ప్రపంచాతీతము.