పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౦

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

ఇంచుమించుగా ౧౮౦౦లీలు (౩౬౦ మైళ్ళు) ప్రయాసముతో పయనము సలిపి దక్షిణకోసలమును బ్రవేశించెను. కోసలదేశమందు తాను జూచినదానిని వినిన దానిని యతడిట్లు వర్ణించియున్నాడు.

"కోసలమారువేల లీలు (౧౨౦౦ మైళ్ళు) వైశాల్యము గలది. దేశముచుట్టు ఎడతెగని పర్వతపంక్తుకు మహారణ్యములు దట్టముగా నలుముకొని వ్యాపించి యున్నవి. కోసల రాజధాని నలుబదిలీలు (౮ మైళ్ళు) వైశాల్యము గలది. ఇచ్చటి భూమి చాలా సారవంతమై యుండుట వలన పంటలు విశేషముగా బండుచున్నవి. దేశము నిండ పట్టణములు పల్లెలు విశేషముగా నొకదానికొకటి సమిాపముగా గలవు. దేశము మిక్కిలి జనసమర్దమై యున్నది. ఇచ్చటి ప్రజలు మిక్కిలి బలిష్టులు, దీర్ఘకాయులు, చామనచాయ గలవారు. మోటుగా గాన్పించెదరు. మఱియు కాళింగులవలేనే కొంచెము కోప స్వభావము గలవారు. కాని మంచి ధైర్యవంతులును, సాహాసముగల వారుగా నున్నారు. ప్రజలు చాల తెలివిగలిగి విద్యాగోష్టియందును తత్వ విచారణయందును మంచి యభిరుచియు ప్రజ్ఞయు జూపుచున్నారు. ఈ దేశపురాజు క్షత్రియ వంశజుడు. అతనికి బుద్ధదేవుని యుపదేములందభిమానము, గౌరవమును మెండు. అతని దయయు ధార్మికత్వము నితరదేశములందు సయితము కీర్తింపబడు చున్నవి. కోసల దేశమున