పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్‌చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

౧౯

గాజేసికొని కళింగరాజ్యము నంతయు తనపాలనము క్రిందకు దెచ్చియుండెను. ఇయ్యది యుఁఆన్‌ చ్వాంగ్ రాకకు కొంచెము ముందుగనో వెనుకగనో జరిగి యుండెను. అందువలన యుఁఆన్‌ చ్వాంగ్‌ చూచిన రాజధానిని నిర్ణయింప సాధ్యముగాదు. ఈ కారణమును బట్టియు కూడ నాతడు వర్ణించిన స్తూపమునుగూడ గనిపెట్ట జాలము. కాని మన యాత్రికుడు సందర్శించిన కళింగ రాజధాని సింహపురమని గాని కళింగనగరమని గాని నిర్ణయించినచో అచ్చట కనతిదూరమున గల సాలెహుండామునందలి స్తూపమే పూర్వము నలుగురు బుద్ధులు నివసించినచోటని నిర్ణయింపవచ్చును. కాదేని, కళింగనగరములోని భాగమగుచు, మధుకేశ్వరుడను నామాంతరము గల ముఖలింగేశ్వరుని దేవాలయమున్న వాడలో, బౌద్ధస్తూపముండినట్లు చిహ్నములు నేటికిని గానవచ్చుచున్నవి; కావున ముఖలింగనగరమె స్తూపముండిన స్థలము గావచ్చును. ఇక కళింగమున కుత్తర ప్రాంతమున ప్రసిద్ధికెక్కిన పర్వత శిఖరము మహేంధ్రగిరి. పరశురాముడిచ్చట తపమును, యజ్ఞమును చేసెనని పురాణాదులు వాకొనుచున్నవి. మరియు బౌద్ధధర్మ గ్రంథములందుగూడ మహేంద్రగిరి చాల ప్రఖ్యాతి గాంచియుండెను. గావున మన యాత్రికుడు పేర్కొన్నదీ నగరమేయని యుహింప వచ్చును.

కళింగరాజ్యము నుండి యుఁఆన్‌ చ్వాంగ్‌ వాయువ్యదిశాభిముఖుడై అడవులగుండను పర్వతకనుమల గుండను