పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్‌చ్వాంగ్ వర్ణించిన ఆంధ్రదేశము

౧౧

యున్నాడు. ఒక ప్రాంతమునుండి మరియొక ప్రాంతమునకు గల దూరమును కొంచెము హెచ్చుగనో, కొలదిగ తక్కువగనో, చెప్పుచు నాయాదేశముల నాతడు ఒకప్పుడు చూడకయె వర్ణించెనాయను సందియము వొడమునట్లుగా వర్ణించినాడు. యుఁఆన్‌ చ్వాంగ్‌ తామ్రలిప్తి నగరమునుండి, కర్ణ సువర్ణ దేశమునకు జనియెను. ఇది దక్షిణ వంగదేశములో నొక ప్రాంతము: నేడు సింగభూమ్‌ అనియు, వీరభూమ్‌ అనియు పిలవబడుచున్న మందలము. ఆదేశమునుండి మనయాత్రికు డోఢ్రదేశమునకు జనియెను.

యుఁఆన్‌ చ్వాంగ్‌ ఓఢ్రదేశమునుండి బయలుదేరి దక్షిణాభిముఖుడై ౧౨౦౦లీలు ప్రమాణము చేసి కుంగ్-యూటో అని బిలువబడు దేశమును ప్రవేశించెను. ఈకుంగ్‌-యూ-టో యనుపేరు చీనీభాషా పండితులు సంస్కృతము నందు "కోన్యోఢ" యని భాషాంతరీకరణము చేసిరి. మనయాత్రికుని వర్ణనలబట్టి యీదేశము చిల్కసముద్ర ప్రాంతమునకును గంజాము మండలమునకును సరిపోవుచున్నదని కన్నింగ్‌ హామ్‌ పెర్కసన్‌ పండితులు నిర్ణయించిరి.[1]. ప్లీటుపండితుడీ దేశమును బృహత్‌ సంహితయందు పేర్కొనబడిన "కుండ్య" లేక "హేమకుండ్యము"నకు సరిపోవుచున్నదని యభిప్రాయ పడుచున్నాడు.[2]

  1. Ancient Geography of India, p. 513
  2. Dr.Fleet in Indian Antiquary vol. xxii pp 171, 179.