పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలిసికొని, తనసేనయందు విలుకాండ్రను, అశ్వదళమును అభివృద్ధి పఱచుకొని రాజ్యము ననేక విధముల పెంపునొందించెను.

రాయలరాజ్యము తుంగభద్రాకృష్ణవేణినదులకు దక్షిణముగా, పూర్వ, పశ్చిమసముద్రముల దాకుచు, సింహళ ద్వీపములలోనికి సయితము వ్యాపించియుండెను. అందువలన నాతని శాసనములు ఇంచుమించుగా, పైజెప్పిన దేశమంతటను గానవచ్చుచున్నవి.

దేవరాయల కర్ణాటసామ్రాజ్యము, చిన్న చిన్న రాజ్యములక్రింద విభజింపబడి, యొక్కొక్క దండనాథునిక్రింద నుంచబడుచుండెను. ఈ రాజ్యములందు, రాయల ప్రతినిధులు పారుపత్యము నిర్వహించుటకు కొందరు (కారకర్తలు) ప్రథానులుండిరి. వారందఱునవసరము వెంబడిని, యొక రాజ్యమునుండి, మరియొక రాజ్యమునకు మార్చబడుచుండిరి. కర్ణాటసామ్రాజ్యములోని మైసూరుప్రాంతము, నాలుగు రాజ్యములుగా పరిపాలింపబడుచుండెను. పశ్చిమరాజ్యము, ఆరగడ రాజ్యమనియు, మంగళూరు ప్రాంతము, మంగళూరు రాజ్యమనియు, కోలారు మండలము, ముళువాయి రాజ్యమనియు, ఈ మూడింటికి నడుమగల దేశము బారకూరు రాజ్యమనియు వ్యవహరింప బడుచుండెను. విజయనగరమునకు సమీపమునగల దేశము పెనుగొండ రాజ్యమనియు, దానికి దక్షణసీమ వేలూరు రాజ్యమనియు, దానికి తూర్పుప్రాంతము చంద్రగిరి రాజ్యమనియు,