పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధన్నాయకుని స్థానమున, దేవరాయలు కార్యనిర్వహణమునకై "హంబనురీర్" అనునాతని ప్రధానిగ నియమించెను. రాయల యభిప్రాయమున నీతడు ఆబ్రాహ్మణ ప్రధానియంతటి ప్రజ్ఞావంతుడగుటచే, నా యుద్యోగ మొసగియుండెను. కాని యీతనియంత దుర్మార్గుడును, కుటిలుడును, కౄరుడును, మరియొకడు లేడు. ఇతడు చూచుటకు పొట్టిగను, ఆసహ్యకరముగ నుండును. మీదు మిక్కిలి హీనకుల సంజాతులు, అసూయా పరతంత్రుడు, ముక్కోపి, కుటిల ప్రవర్తనము గలవాడు, దుర్మార్గుడు, నీచుడు, గౌరవమెఱుగనివాడు. వేయేల? యీతనియందు దుర్గుణము లన్నియు మూర్తీభవించినట్లు దోచును. చెప్పుకొనుటకు మంచివిషయ మొకటియైనలేదు. రాజకార్య మీతనిపాలబడిన తోడనే ధర్మాసనము గూడ మాలిన్యపూరిత మయ్యెను. ఆత డధికారము పూనిన తరువాత మొదట గావించిన ఘనకార్యము నాకు ప్రతిదినమును బంపబడు చుండిన దినవెచ్చమును ఆపివేయుట. హురమంజి నగరపువారి కిపుడు నామీద తమకుగల అసూయను దీర్చుకొనుట కవకాశము గలిగెను. ఎన్నెన్ని విధముల నామీద చాడీలు చెప్పి మనస్సు పాడుచేయ వలయునో అన్నియు చెప్పి నామీద ప్రధానికి మునుపున్న దానికంటె నసహ్యము నెక్కువజేసిరి. హంబనురీర్ యభిప్రాయము నెఱిగిన వారందఱు, నాతని యిష్టానుసారముగ, నేను నిజముగా పారశీక చక్రవర్తిచే నంపబడిన రాయబారిని గాననియు వర్తకము చేయదలచివచ్చి,