పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రాడులాగుచు రాజు ముంగిట ఏతాము తోడుటభినయించిరి. రాయిక్రిందకువచ్చి ఏనుగు, గాలిలో పైన నున్నప్పుడు సయితము తొండమును తనహంగుపాటదారుల పాటలకు లయ, చెడకుండ తాళము వేయునట్లు ఎత్తుచు దించుచుండెను.

పౌరాణికులు, కధకులు, పాటలవాండ్రు, సుద్దులవారు గాయకులు, నటులు, గారడివాండ్రు, విప్రవినోదులు మున్నగువారలకెల్లను రాయలు, వారివారి విద్యాగౌరవమునుబట్టి, సువర్ణాభరణములను, నూతన వస్త్రముల నొసంగి సత్కరించెను. ఇట్లీ మహోత్సవము లెడతెఱపిలేక మూడహోరాత్రములు, అత్యంత వైభవముతో జరిగెను. అచ్చటి వింతలను, విశేషములను ఒక్కొక్కటిగా చెప్పినగాని తనివి తీరదు. అటు చెప్పుటకు తగినంత సావకాశముగాని కాలముగాని లేదు. వాటి నన్నిటిని జూచియుండవలసినదే.

దేవరాయ మహారాయల సందర్శనభాగ్యము

"పండుగ మూడవనాడు రాయలు సోపానమంటపమునుండి పయనమయి ఇంకొక చోటకు బోవును. ఆదినమున నన్ను అచ్చటిపరివారము రాయలసన్నిధికి దోడ్కొనిబోయిరి కర్ణాటాంధ్రాధిపు మధిష్టించియున్న, సింహాసనము మహోన్నతమయి యుండెను. అంతయు స్వర్ణమయమును, రత్నఖచితము నయియుండెను. ఆసింహాసనమును చేసిన యగసాలి యెట్టిశిల్పియోకాని యందలి కళానైపుణ్యము వర్ణనాతీతము. ప్రపంచమందు ఏదేశము నందును ఏరాజున