పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారెందరి ప్రాణములు, పరులెరుగకుండ క్రూరముగ గైకొనబడుచుండెనో, యాహంతకుని పరివారము తప్ప నొరులెవ్వరు నెఱుంగరు. ఇట్లు నగరమున నూరును పేరును పలుకుబడియు గల్గి రాజభక్తిగల ప్రతిమనుజుడును దారుణముగ వధింపబడియెను. ఒకమూల నీ దారుణ కృత్యములు జరుగుచుండ, రాయలసోదరుడు, రాయల యంత:పురమునకు జనెను. అచ్చట కావలివాండ్రను మచ్చికలాడి, తనయింట జరుగుచున్న విందునకై యాహ్వానించి, మెల్లగా వారినందరి నొకరి తరువాత నొకరిని తనయింటికి బంపివైచెను. ఇట్లు యించుమించుగా, నగరికావలివాండ్రనందఱిని బంపివైచి, మెల్లగా రాయలను సమీపించెను. రాయల సమ్ముఖమునకు జనునపు డాతడు చేత నొక బంగరుపళ్లెరము బట్టుకొని, యందొక బాకును దాచియుంచి దానిపై తమలపాకులు కప్పివైచి యుంచెను. రాయలను సమీపించితోడనే "జగత్ప్రభూ! ఏలినవారు విందారగించుటకై సర్వము సన్నద్ధము చేయబడినది. ఇక తమరాక మా కనుగ్రహింప వేడెదను." అని పల్కెను. అదృష్టవంతులను, కారణ జన్ములు నగు మహారాజులకు రాబోవు విపత్తులు సూచితమగుచుండునని పెద్దలవలన విందుము. అందుచేతనే కాబోలు రాయ లదృష్టవశమున తన కస్వస్థతగా నున్నదనియు తమ్ముని యాహ్వాన మంగీకరింప జాలకునికి మన్నింపవలయుననియు వేడుకొని విందునకు బోయి యుండలేదు.