పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండువేళల మేత నిడుదురు. ఏనుగున కొక్కసాలచొప్పున అన్నింటికిని అన్నిసాలలును గలవు. ఆసాలల గోడలు ఎత్తుగానుండి బలిష్ఠములుగా నున్నవి. ఆ గోడలపైన లావుపాటి దూలములును, వానిపైన కర్రసరంబియు గలదు. పైనున్న దూలముల కీ యేనుగుల వీపులకు, మెడలకు, గట్టబడిన నినుప గొలుసులు గట్టిగా గట్టబడియుందురు. ఇట్లుగాక మరి యేవిధమున వాటిని గట్టిబెట్టినను ఆ పెద్ద జంతువులు బలముగల వగుటవలన సులభముగా గొలుసులను వదలించుకొని పాఱిపో గలవు. వీటికి మందఱికాళ్ళకు గొలుసుల సంకెళ్ళుగూడ తగిలించ బడుచుండును.

" ఈ దేశమున జనులు, గజముల నీక్రిందివిధముగా బట్టు కొందురు. అ జంతువులు సాధారణముగా నీరుద్రావు జలాశయములకు బోవు మార్గమునం దొక పెద్దగోయిని త్రవ్వి, దానిపై, వెదుళ్ళను, ఆకులను కప్పి పలచగా మట్టిని జల్లి మామూలు నేలవలె నుంచుదురు. ఎప్పటి త్రోవయే యనుకొని యేనుగు లా గోతిమాద నడువబోయి యందు కూలును. అటుపిమ్మట రెండుమూడు దినములవఱకు మనుష్యుల నెవరిని ఆ చెంతకు బోనీయరు. అట్లు కొన్నిరోజులు జరిగిన పిమ్మట నొక డా మృగముకడ కేగి, దానిని పెద్దకర్ర తీసుకొని యూరకమోదును. ఒకవంక ఆకలిదప్పులచేతను మరియొకవంక బాధాకరములయిన దెబ్బలచేత నొడలునొచ్చియున్న యాకరి కడకు నొకడు హటాత్తుగా బరువెత్తికొని