పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాగారమునుండి వెడలినపుడు కొలువు చాలింపబడును. ఆయనకు ఏడు రంగురంగులగొడుగులు గలవు. ఆతడు బయలుదేరునపు డా యాతపత్రములను గైకొని పరివారము ముందు నడుచును. వేత్రహస్తులు భయపార్శ్వములందును నడచి వత్తురు. వారి ముంగిట శంఖకాహళాది మంగళతూర్యములు పూరించబడుచుండును. ఆతని కిరుప్రక్కలను, వందిమాగధులు కై వారములు సేయుచు స్త్రోత్రపాఠములను జదువుచు "జయీభవ! దిగ్విజియీభవ" యనుచు నడుచుచుందురు. ముందు వేత్రహస్తులు బరాబరులు దెలుపుచుండ, ఇతర సేవకులు ఛత్ర చామరములను బట్టుకొని వెంటరా, దణ్ణాయకుడు (సర్వసేనాధిపతియు మహాప్రధానియు అబ్దుర్‌రజాకు కాలమున నొక్కడేకాబోలు!) బయలువెడలి, రాజమందిరమున కరుగును. రాజనగరునకు దణ్ణాయకుని సభామంటపమునకు నడుమ నేడు కక్ష్యాంతరములు గలవు. ఒక్కొక్క కక్ష్యాంతరము గడచునప్పటి కాతని వెంటబట్టుకొని రాబడు గొడుగులలో నొకటి తరువాత నొకరు వరుసగా మూసి వెనుకనుంచ బడుచుండును. అట్లా దణ్ణాయడు ఏడుకక్ష్యాంతరములను దాటుసరికి ఏడుగొడుగులు వెనుక నుంచబడును. రాజసముఖమును దణ్ణాయకుడొంటరిగ ప్రవేశింప వలయును. ప్రవేశించి రాజ్యమునందలి సర్వవృత్తాంతములను రాయల కెరిగించి, యాతని యాజ్ఞాను గైకొని సెలవు దీసికొని పోవుచుండును. ఈదణ్ణాయకుని నిజమందిరము రాయలనగరునకు వెనుక నున్నది.