పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుత్తరదక్షిణముల వాటికి నడుమను, పూర్వపశ్చిమద్వారముల నడుమను రెండామడల దూరముండును. వెలిప్రాకారములలో మొదటిదానికిని, రెండవదానికిని నడుమగల ప్రదేశమున సారవంతములయి, సాగుచేయబడుచున్న భూములు, ఫలపుష్ప భరతములయిన చక్కనితోటలు పెక్కులు గలవు. అచ్చటచ్చటను మంచి సౌధములును, యిండ్లును, మంచిబావులును, ఆరామములును గలవు. వెలుపలినుంచి మూడవ ప్రాకారము మొదలుకొని లోపలి యేడవ ప్రహరీవరకును, రాజవీధి కిఱు ప్రక్కలను దట్టముగా నిండ్లు, అంగళ్ళు నడుమ నడుమ వీధులు తోటలును గలవు. ఏడవ ప్రాకారములోపల రాయలు నగరును, సభాగారములును, సౌధములును నాలుగు రాజవీథులు గలసికొను మొగయును గలదు. ఆరాజవీధులు నాలుగు నొకదానికొకటి యెదురుగా నున్నవి. ముందుత్తరముగా రాయలు నివసించు నగరుకలదు. ఈనగరు వాకిటనుండియే నాలుగు వీథులును నాలుగు మొగలకు బోవును. ప్రతిరాజవీధి మొగను నగరి వాకిటకు సమీపమున ధనురాకారముగానున్న తోరణముతో గూడిన యెత్తైన గోపురమును, దానిచుట్టును స్తంభములతో నలంకరింపబడిన వసారాయును గలవు. ఈరాజవీథుల మొగలనున్న తోరణగోపురము లన్నిటికంటె నగరి వాకిటను అందమైన గోపురము ఒకటి గలదు. ఈ తోరణగోపురముల క్రిందినుండి నాల్గుముఖములకు బోవు రాజవీథులు మిక్కిలి వెడల్పుగానుండి రమ్యముగానున్నవి."