పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయనగర వృత్తాంతము - సప్తప్రాకారములు.

"విజయనగరము బహువిస్తీర్ణమై, మనోహరమైన మహానగరము. విజయనగరమును బోలిన యనుపమాన భాగ్యవైభవ సౌందర్యములుగల మహానగరమును ప్రపంచమందెచ్చటను ఇంకొకదానిని చూడబోము. మీదుమిక్కిలి వినజాలమన్న అతిశయోక్తి కాదు. ఎంతవిస్తీర్ణము! ఒకప్రాకారము లోపల నింకొక ప్రాకారము చొప్పుననేడు ప్రాకారములు నడుమ గట్టబడిన యీ మహానగరము మిక్కిలి దుర్గమమైనది, ఏడవ ప్రాకారమునకు వెలుపల యేబదిగజముల వెడల్పుగల వాహ్యాళి ప్రదేశముగలదు. అచ్చోట నిలువెత్తున మొనలుదేఱి, కఱుకుగానున్న బండరాళ్ళు దట్టముగా నిలువు లోతున బాతిబెట్టబడి యున్నవి. వాని మూలమున కాలిబంటుగాని రౌతుగాని సులభముగా నాఱాళ్ల నడుమనుండిదూరి పోవజాలడు.[1]

"నగరముచుట్టును గలసప్త ప్రాకారములలో, వెలుపలిది వలయాకారముగా నుండి యెత్తైన యొకశిఖరము పైనున్నది.[2]

  1. నిలువుగా బాతిపెట్టబడిన యీఱాళ్ళనుగురించి క్రీ.శ. 1520 సంవత్సరమున విజయనగరమును సందర్శింపవచ్చిన "డామినిగోపేయస్" యను బుడతకీచుడు గూడ దానును వాటిని జూచియుంటినని వ్రాసియున్నాడు. తర్వాత తల్లికోట యుద్ధానంతరమున మహమ్మదీయులచే నీనగరము విధ్వస్తము గావింపబడినపు డీప్రాకారమును ఈఱాళ్ళును రూపుమాపబడెను.
  2. అబ్దుర్ రజాక్ వర్ణించిన యీసప్తప్రాకారములు అందందుగల ద్వారములు కవాటములు ఈకాలపు విజయనగర యాత్రికులకు నెచ్చటెచ్చట నున్నవో సులభముగా బోధపడవు. మనయాత్రికుడు పశ్చిమ తీరమునుండి బయలుదేరి విజయనగరమును నైఋతి దిక్కునగల ద్వారము గుండనే ప్రవేశించినట్లు తోచెడిని. అదియే నిశ్చయమని యెంచిన యెడల, నాతని రాక నెఱింగి కర్ణాటక్షితిపాలు డంపిన ప్రతీహారులు, అబ్దుర్ రజాక్ ను, ఎదుర్కొని నగవను ఏడవ వెలిప్రాకారమున నగరమునకు నైఋతి దిక్కుననున్నదనియే నిశ్చయింప వలయును. ఈరాయబారి ప్రవేశించిన మొదటి ద్వారము హోస్పేటకు నైఋతిదిక్కుగాగల రెండుకొండలనడుమ నున్నట్లు గానవచ్చును. ఒక్క మన అబ్దుర్ రజాక్ మాత్రమేకాక తరువాతను అంతకు బూర్వమును వచ్చిన విదేశీయులందరు నీ ద్వారము గుండనే నగరును సొచ్చియుండిరి.