పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు మమ్ముచితరీతుల గౌరవించి, చక్కనియొక సౌధమునకు గొంపోయి విడిదినిచ్చిరి.[1]

"విజయనగర మేలు నృపాలుడు అసాధారణ బలదర్పితుడు. అతని సామ్రాజ్యము సింహళద్వీప ప్రాంతముల నుండి కలబరిగె రాజ్యప్రాంతము వఱకు వ్యాపించి, యెటుచూచిన వేయి యామడల దూరము వ్యాపించియున్నది అతని రాజ్యమునకు పూర్వపశ్చిమ దిశలందు సముద్రములే యెల్లలు. దేశమంతయు చక్కగ సాగు చేయబడుచున్న కనులపండువైన భూములతో నొప్పాఱు చున్నది. ఈక్ష్మాపాలుని రాజ్యమందు దేశదేశాంతర నగరములతో సముద్ర వ్యాపారముచేయు ప్రసిద్ధ రేవుపట్టణములు మూడువందలు గలవట! నగరమందెచ్చట చూచిన రాక్షసులవలెను కొండలవలెను భయంకరములయిన యేనుగులు వేలకొలది గాన్పించు చుండును. ఈరాజు సైన్యము నందు కాల్బలము పదనొకండు లక్షలు గలదు. ఈదేశీయులు తమయేలికను 'రాయ'లని వ్యవహరింతురు. హిందూస్థానమందెచ్చట నీ రాయలంతటి బలదర్పసంపన్నుండగు భూపాలుడింకొకడు లేడని విందుము. ఇచ్చట ప్రజలలో నందరికంటె బ్రాహ్మణులు విశేష గౌరవమును బొందుచు పూజింపబడు చున్నారు.

  1. అబ్దుర్ రజాక్ కళ్ళికోటలోనుండగా, యాతనిగూర్చి వినిన దేవరాయ లాతని దన కొల్వున కాహ్వానించి యుండునని సూయలుదొర అభిప్రాయ పడినాడు. కాని యది సరియైన యూహయని నేననుకొనను.