పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున అప్పటికే రెండుమూడు వేలమంది హిందువులు పైని చెప్పినవిధముగనే దుస్తులు ధరించి సభ నలంకరించి యుండిరి. ముసల్మానులలో ప్రముఖులు గూడ గొంద ఱచ్చట నుండిరి. వారు నన్నుచితాసనమున గూర్చుండ నియమించిన తరువాత నేను మాచక్రవర్తి యిచ్చిన శ్రీముఖమును చదివితిని. పిదప ఆమహారాజు పంపిన కానుకల దెచ్చి యర్పించితిని. సామూరి నా రాయబారమున కంతగౌరవ మొసంగినట్లు కాన్పింపలేదు. అంతట నేను సెలవు తీసికొని నాబసకు తిరిగి వచ్చితిని. హార్మజునగరపు రాజంపిన యుత్తమాస్వములు మొదలయిన సరకులతో నిండిన యోడ ప్రయాణము నందుచాల కష్టముల పాలయి ఓడ దొంగలచే దోపిడి చేయబడి, వస్తువుల నన్నిటిని గోల్పోయి, చిట్టచివరకు ప్రాణములతో కళ్ళికోట చేరుకొనినది. నిజముగా నాప్రియ మిత్రుని ఆయోడలో నుండి బ్రతికివచ్చుట జూచినపుడు నాకు పరమానందమయ్యెను.

"కళ్ళికోటనగరమున అయిదారు మాసములు, నిరుద్యోగినై, గౌరవములేక దు:ఖభాజనమైన జీవనమును గడపితిని. ఆరోజులలో నాకు దు:ఖ మొక్క స్నేహితుడును, కష్టమొక చెలికాడునై యున్నట్లుండెను. అట్లుండ నొకనాడు చీకటిరాత్రి, నేను మంచముపై పరుండి నిద్రించువేళ, విసుగెత్తిన నాప్రాణమునకు కష్టములు గట్టెక్కెనో యన్నట్లు, అంధకారమునుండి వెలికి త్రోయబడినట్లు స్వప్న మొకటి గంటిని. ఆ కలయందు మాచక్రవర్తి కాఖాని సయిద్‌సుల్తాను,