పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారందఱు మాయేలిక యనుజ్ఞనిచ్చిన నాతని నామముతోజేర్చి నమాజు చేసికొందురనియు విన్నవింపజేసెను.

"అతనిరాయబారి బంగాళాదేశము నుండి తిరిగివచ్చుచుండిన రాయబారులతో కలసివచ్చుటజేసి, మారాజుకొనువున నున్న సామంతరాజులు కొందరు ఆతని ఆగమనము రాజున కెరిగించి కానుకల నర్పింపజేసిరి. ఆవచ్చిన కళ్ళికోటరాయబారి మహమ్మదీయుడు; మంచివక్త; తనవాచాలత్వముచే రాజును సులభముగ మెప్పించి, పిమ్మట నీవిధముగ ముచ్చటించెను.

"మాయేలిక మీతో నెయ్యమును స్నేహము నెఱప దలచి న న్నంపియున్నాడు. మీరు మాపై ననుగ్రహించి మహమ్మదీయ మతప్రవక్తలను మారాజుకడకు బంపినయెడల అజ్ఞానాంధకారమున నున్న మాదేశపు ప్రజలను, ఏలికను, వెలుతురు లోనికి దెచ్చి పుణ్యముగట్టు కొనినవా రగుదురు." ఆమాటలకు మాచక్రవర్తి మనసుకరిగినవాడై తా నొకరాయబారము బంప నిశ్చయించెను. ఆమహత్కార్యము నిర్వహించుభారము దైవకృపవల్ల యీ అల్పునిపై బడెను. నన్ను కొంద ఱసూయాగ్రస్తులు సముద్రయానమున బోయినవారు మరలతిరిగిరాజాలరనియు, నదిఅపాయకరమనియు నిరుత్సాహపఱచిరి. కాని వారిభయములు బెదరింపులు నిష్ఫలములయ్యెను. మూడుయేండ్లు గడచుసరికి నేనుసుఖముగా స్వదేశము జేరితిని.