పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలధర్మమునొంది మమ్మందఱను దు:ఖసముద్రమున ముంచివేసిరి.

"ఎట్టకేలకు ఇక్కడనుండి హిందూస్థానమునకు నోడనెక్కితిమి. పదునెనిమిది దినము లహోరాత్రము లొక్కరీతిగ మాయెడ గాలి బోసికొనుచు నడచెను. పరిశుభ్రమైన యాసముద్రపు గాలివలన నాకు సంపూర్ణముగా తిరిగి ఆరోగ్యము కలిగెను. అటుల పదునెనిమిది దినములు గడచి, పందొమ్మిదవ నాటి యుదయమున, దైవకృపవల్ల సురక్షితముగ కళ్ళికోట రేవున మాయోడ లంగరు దింపెను. ఇంతటి నుంచి నా దేశమున నేను చూచి వినినవింతల నన్నిటిని యధార్థముగ వర్ణించెదను.

"కళ్ళికోట మిక్కిలి నిరపాయకరమైన నౌకాశ్రయము. హర్మజువలె నిచ్చటికు నానా దేశీయులగు వ్యాపారులు, వాణిజ్యార్థమై వచ్చుచు బోవుచుందురు. అబిస్సీనియా, జీర్పాద్, జాంజిబారు దేశీయులనుండి యోడలు సరకు తీసికొని తఱచుగా నీ రేవునకు వచ్చుచుండును. అప్పుడప్పుడు మక్కానగరము నుండియు, నరేబియా దేశపుటితర నగరముల నుండియు నోడలు వచ్చుట గలదు. ఆవచ్చిన యోడలు యిచ్చవచ్చినకాల మాగుచుండును. ఈపట్టణమందెచ్చట జూచినను నాస్తికులు (కాఫరులు, మహమ్మదీయేతరులు) గలరు. అందువలన నీనగరమవశ్యము ముసల్మానులచే జయింపబడదగినది. ఇచ్చట చాలమంది మహమ్మదీయులును గలరు. వారు శుక్రవారమునాడు, నమాజుచేసు కొనుటకై రెండుగోపురములు గల పెద్దమసీదులను కట్టించుకొనిరి.