పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను, మనుష్యులెక్కు ఓడలో [1] నుంచ వీలులేదని యా గుర్రముల నొక యోడలోను, నన్ను నాపరివారమును మరియొక యోడలోను నెక్కించిరి. అట్లు ఆ రెండోడలలో నేనును నా పరివారమును పయనమైతిమి.

"ఓడలలోని దుర్వాసన నాకు స్మృతిలేకుండ జేసెను. దానికి తోడు సముద్రప్రయాణము నాకు భయానహమయ్యెను. ఈ రెండు కారణముల వలన నేను మూడు దినములవరకు నూపిరిలేకుండ చచ్చినివానివలె మూర్చ పోయియుంటిని.

"మూడవనాడు నాసికాగ్రమున కొనియూపిరి కనబడినపుడు మావారు నేనింకను జీవించియుంటినని దైర్యము దెచ్చుకొనిరి. నాకు కొంచము తెలివి వచ్చునప్పటికి ఓడమీద నాతోపాటు ప్రయాణము సేయుచుండిన నామిత్రులగు వర్తకులందరు నైక్యకంఠముగ సముద్రప్రయాణమున కనుకూలమైన అదను దాటిపోయిన పిమ్మట బయలు దేరిన నెట్టి యుపద్రవములైన రావచ్చుననియు, అట్టి సమయమున నెవడైన నకాలమరణము నొందిన వానిని వాడే నిందించు కొనవలయును గాని యితరుల నేమనినను లాభము లేదనియు మొదలగు మాటలు నెన్నియో నన్నాడి నిందించి, తుదకు మేమింక నీతో నీయోడమీద రామని యొక్కపెట్టున నంద

  1. మనుష్యు లెక్కు ఓడకు "జోగు" అనియు సరకు గొంపోవు వోడకు "కప్పలి" యనియు నాంధ్రమున పేరులు గలవు.