పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండు సంవత్సరములకు సుల్తాను అబుసయిద్‌న కాప్తుడయి యాతనిచే విశేషముగ గౌరవింపబడియెను. ఈతనికాలమున అబ్దుర్‌రజాక్ "ఖాన్‌కహ" అను సుల్తాన్‌యొక్క భోజనశాల కధ్యక్షుడుగా నియమింప బడియెను. ఈయుద్యోగమునం దతడు చనిపోవువఱకు నుండి ప్రభువునకత్యంతప్రియుడైతన యుద్యోగము విశ్వాసముతో నిర్వర్తించియుండెను.

అబ్దుర్ రజాక్ క్రీ. శ. 1482 వ సంవత్సరమున అక్టోబరు నెలలో కాలధర్మము నొందెను. ఈతడు రచించిన గ్రంథములలో మిక్కిలి యుపయుక్తమైనది, మనకు ప్రస్తుత విషయమును గూర్చి దెల్పునది "మల్లూ-ఉస్-నఅదయిన్" అను చరిత్రగ్రంథము. ఇయ్యది యాతని కాలము నుండియు సర్వజనాదరణీయమై యుండెను. ఇందు మన విజయనగర సామ్రాజ్యవృత్తాంతము మాత్రమే గాక యాతడు గొల్చియుండిన ప్రభువుల పరిపాలనము నాటి విషయములు గూడ చాలగలవు. ఈగ్రంథము రెండు సంపుటములుగా నున్నది. ప్రథమ సంపుటమున విజగీషామనీష గల టైమూరు చక్రవర్తి యారంభదశ మొదలుకొని యాతని మరణాంతరము వఱకు గల చరిత్రయంతయు సవిస్తరముగ దెలుపబడెను. రెండవ భాగమున టైమూరు వంశస్థుల చరిత్ర మొదలుకొని రజాక్ గొల్చిన కడపటి పారశీకసుల్తాను హసన్‌మీర్జా మరణానంతము వఱకు జరిగియుండిన వృత్తాంతములను వివరించెను. ఈగ్రంథమును అబ్దుర్ రజాక్ చనిపోవుటకు రెండుసంవత్సరములకు, బూర్వము క్రీ. శ. 1470 లో రచించెను.