పదునైదవ ప్రకరణము
83
జీవా —— ఇంకేమున్నది?
నిమాయిమణి, మంచి పనసపండొకటియున్నది, అని చెప్పి లోపలికిఁ బోయి తెచ్చి ముందుంచెను. ఏమియు బదులు చెప్పక జీవానందగోస్వామి ఆ పండును తినెను. నిమాయి నవ్వి, ‘అన్నా! ఇంకేమియు లేదే’ యనెను.
జీవా —— అయిన నేమి, ఇం కొకనాఁటికి వచ్చి భోజనము చేసెదను.
అని చెప్పి లేచెను, చేతులు కడిగికొనుటకు నిమాయి నీళ్ళిచ్చెను. జీవానందుఁడు చేతులు కడిగికొనుచుండఁగా, నిమాయిమణి, ‘అన్నా! నే నొకమాట చెప్పెదను, విని యాప్రకారము చేసెదవా?’ యనెను.
జీవా —— అదేమి మాట?
నిమి —— నాపై ఆన పెట్టుము.
జీవా —— ఏమి చెప్పుము?
నిమి—— ఆలాగు చేసెదవా?
జీవా —— ఆమాట మొదట చెప్పుము?
నిమి —— నీవు ఆన పెట్టు నీ కాలికి మ్రొక్కెదను.
జీవా —— ఆన పెట్టితిని; కాళ్లకు మ్రొక్కు మనఁగా, నిమాయిమణి కాళ్లపైఁ బడఁగా ఆశీర్వదించి, లెమ్మని చెప్పి ‘ఆమాటయేమో చెప్పుము’ అనెను.
నిమాయిమణి, చేతులు రెంటిని గ్రుచ్చుకొని, తలవంచికొని, కొంత సేపటికి మొగమెత్తి జీవానందునిఁజూచి నేలపై దృష్టి నిగుడించి, మరల తల యెత్తి నోరు విడిచి, ‘ఒక తేప వదినెను పిలుతునా?’ యనెను.