పుట:Aananda-Mathamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

45


మహేంద్రుఁడు సంగీతార్థమును దెలిసికొనఁగోరి 'మరల నొకతూరి చెప్పు' మనెను.

భవానందుఁడు మరల నొక్కసారి గీతమును మొదట నుండి అర్థమగునట్లుగాఁ జెప్పుచు కన్నీరు కార్చుచు నుండుటను జూచి, మహేంద్రుఁడు మిగుల నాశ్చర్యము నొంది “మీ రెవరు?" అని యడిగెను.

భవానంద—— మేము సంతానులము.

మహేంద్ర——సంతానులనగాఁ నేమి? ఎవరి సంతానులు?

భవానంద—— మహామాతయొక్క సంతానులము.

మహేంద్ర——మంచిది, సంతానులు దొంగతనము చేసి, దారికట్టి దోఁచి మహామాతపూజ చేయవచ్చునా యేమి? ఇదెట్టి మాతృభక్తి!

భవానంద—— మేము దొంగతనము చేయలేదు, దారికట్టి దోఁచలేదు.

మహేంద్ర —— ఇప్పుడేకదా మీరు ఒక బండిరూపాయలను కొల్లగొట్టితిరి !

భవానంద—— అది కొల్లయగునా యేమి? ఆధన మెవరిది?

మహేంద్ర——అది రాజు ధనము కాదా యేమి?

భవానంద——రాజుధనమా! ఈధనమును తీసికొనుటకు వాని కేమి యధికార మున్నది?

మహేంద్ర——రాజుగా నుండుట చేతనే.

భవానంద—— రాజు చేయవలసిన పని యేమి?

మహేంద్ర—— ప్రజలను పాలించుచుండుట.