పుట:Aananda-Mathamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ఇది బంగాళీదేశమునందు 1773 - 74 సంవత్సరములందు జరిగిన సన్న్యాసివిద్రోహచరిత్రాధారముచే రచయిత మైనది. సన్న్యాసివిద్రోహ (Sannyasi Rebellion) యథార్థచరిత్రము ఇంగ్లీషు గ్రంథములందు ఉద్ధృతమై యున్నది. పరిశిష్టమును (Appendix) జూచిన వేద్య మగును. ఉపన్యాసమందు వర్ణింపఁబడిన యుద్ధములు వీరభూమియందు జరుగ లేదు. ఉత్తర బంగాళా ప్రదేశమునందు జరిగినవై యున్నవి. ఈ వ్యత్యాసము గ్రంథమునం దుండుటను దోషముగా గ్రహింపకుఁడు, ఏలన, ఉపన్యాసము చరిత్రము కాదు కదా!

బెంగాలువిభజనముసకు ప్రతికూలముగ 1906 - వ సం!! ప్రాంతమున బెంగాలునందేకాక దేశమంతట తీవ్రప్రచారము సాగెను. బెంగాలీలు బారిసాలునందు రాష్ట్రీయకాన్ఫరెన్సు సాగించినపుడు అధికారులు దీనిని చెదరగొట్టి శ్రీసురేంద్రనాథబనర్జీవంటివారినెత్తిని బ్రద్దలు కొట్టిరి. అల్లరికి 'వందేమాతరము' గీతమును పాడుటయే కారణములలో నొకటి యని తెలిసినది కావున యీగీత మున్ననవలను ముద్రించుటలో నేను యెన్నికష్టములకు పాలైతినో చదువరు లూహింపవలెను.

ఇట్లు,

వావిళ్ల వేంకటేశ్వరులు.