పుట:ASHOKUDU.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

అ శో కుఁ డు

నీ రాజ్యసుఖ శాంతి స్థాపనములం గూర్చియ, నీ సర్వభూత దయాళుత్వముం గూర్చియు నిప్పటికిని' భారతవర్ష మునందలి దూర తమగిరి గహ్వరములయందుఁ గూడఁ బ్రతిధ్వనులు బయలు దేరుచున్నవి !

ఓ కీర్తిభూషణా ! రాజర్షీ ! నీవు చేసిన సత్కార్యము లకు ——బుద్ధ దేవుని శాంతిమత ప్రచారమునకు— నీవు చేసిన సౌకర్యములకు సాగర మేఖలా వలయితంబగు సర్వరాజ్య ప్రదానమునకుఁ బ్రతిఫలముగ నీ వెట్టిసుఖమును గోర లేదు- ఇంద్రత్వము కోర లేదు; బ్రహ్మత్వము కోర లేదు; కేవలము స్వధర్మమున దృఢవిశ్వాసమును, జిత్తశుద్ధియు, నాత్మసంయమనమును మాత్రమే నీవు కోరుకొంటివి. పరమేశ్వరాను గ్రహమున నీ వాంఛితము సంపూర్ణముగ ఫలియించినది !

ఓ రాజర్షీ ! జరామరణాతీతంబగు నే లోకమునం దిప్పుడు నీవుంటివో యాలోకమునుండి నీకృపామృత కటాక్షముల నొకసారి నీప్రియభారత వర్షము పైఁ బ్రసరింపఁ జేయుము ! ఓ శాంతి ప్రియా ! నీ భారతవర్షము చిరశాంతి సౌభాగ్య విరాజితంబగు నట్లుగ నాశీర్వదింపుము !

ఓ ప్రియదర్శనా ! నీ పవిత్ర చరిత్రము—— నీ రాజ్యపాలన చాతుర్యము — నీ రాజ్య విస్తారము, భారతవర్షము నందలి ప్రజలకందఱకును జిరకాల మాధర్శకమై విరాజిల్లు చుండుఁగాక !!