పుట:2030020025431 - chitra leikhanamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

INTRODUCTION.

పీఠిక.

ఇందలియంశములను హెన్రీ వారెన్ (Henry Warren, K.L.) గారి యుపన్యాసములనుండియు, వారు వ్రాసిన పుస్తకములనుండియు మిసెస్ మెర్రిఫీల్డును (Mrs. Merrifield) హెన్రీ ముర్రేయును (Henry Murray. S.A.) ఫిలిఫ్ ఎచ్. డెలమాట్టియును (Philip H. Delamatte) జే. డబుల్యూ. కార్మీల్ ను (J. W. Carniheal) వ్రాసిన గ్రంథములనుండి తీసితిని, అందువలన నాగ్రంథకర్తలకు కృతజ్ఞఉడనై యున్నాను.

ఇట్టిగ్రంథములు తెనుగుభాషయం దరుదు. లేవనియే చెప్పవచ్చును. ఇందుచేత నాలోపమును తీర్చుటకై పుస్తకమును వ్రాయ గడంగితిని.

ఈపుస్తక మానందముగ చదువుటకు పనికిరాదు. దృఢచిత్తులై చిత్రలేఖనమునం దారితేరుట కిచ్చగలవారికే యీ చిన్నగ్రంథ ముపయోగపడును.

చిత్రలేఖనము నేర్చుకొనువారికి ఏ భాషాజ్ఞానము నక్కరలేదు. చదువనెరుగనివారు విద్యయందు ప్రవీణు లగుచున్నారు. పండితుల కీకళ అలవడకపోవచ్చును. అందువలన నీగ్రంథమును సాధ్యమైనంత సులభశైలిని రచించితిని. నేను పండితుడను కాను. ఈ విషయమున పాండిత్య మనవసరము. అందువలన నాంధ్రభాషా పండితులు నాయందు కినుకబూనకుందుదురు గాక.

ఈగ్రంథమును చదువువారి కొకమాట. ఒక పర్యాయము చదివి యోదో ఒక మూలను పారవేయక యిందుండు ప్రతి యంశమును జాగ్రతగ గమనించి అనుభవము వలన ప్రవీనులు కావలెను. ఆంధ్రమాత యొక్క పేరును లోకమంతటను వ్యాపింపజేయవలయును.

ఆంగ్లేయభాషయం దుండు రంగులపేర్లకు సరియైనవి తెనుగూన్ందు లేవు. వానికి సరియైనవి కల్పించుట కెంతయు ప్రయత్నించితిని. కాని నిష్ప్రయోజనంబైనది. ఆంధ్రభాషాజ్ఞానులును, అనుభవశాలురు ఇట్టిపేరులను కల్పించి నాకు తెలియజేసిన యెడల రెండవకూర్పునందు సవరించుకొనెదను.

ఈచిత్రలేఖనమందు మిక్కిలి యభిరుచిగలవారును, సంస్కృతాంధ్ర గ్రంథము లనేకములు బ్రకటించి ఆంధ్రదేశమునకు మహోపకారము నొనర్చినవారును, చెన్నపురి వావిళ్ల రామస్వామి శాస్త్రులు పుత్రులగు శ్రీ వావిళ్ల వేంకటేశ్వరులుగారి ప్రోత్సాహమున నేనీ గ్రంథమునకు పూనుకొన్నవాడను కాన వారికి నా కృతజ్ఞతలు వెల్లడించుచున్నారు.

జయపురము, 30-1-1918.

ఇటుల విన్నవించు భాషాసేవకుడు,

తలిసెట్టి రామారావు. [గ్రంథకర్త]