పుట:2030020025431 - chitra leikhanamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖముయొక్క సౌందర్యమును పోగొట్టును. అంగములకు వికృతాకారమును కలుగజేయును. అందువలన చిత్రకారుడు వీటిప్రాముఖ్యమును తగ్గించి పటముయొక్క సౌందర్యమును నులుపునుగాక!

మెడమీదిఛాయ దట్టముగ నుండును. దీనికి గ్రేవర్ణమును, ఎఱుపును ఉపయోగించెదరు.

భుజములను, మెడను, ఱొమ్మును, చిత్రించునప్పుడు ఛాయద్వారా స్నాయువులను ప్రదర్శించి అంగములకు గుండ్రతనము నివ్వవలెను.

చేతులు:- చేతులను సాధారణముగ చర్మపురంగుతో చిత్రించి గ్రేవర్ణముతో ఛాయ నిత్తురు. ఏచిత్రమునైన చూచి చిత్రించుటకు మంచిచిత్రము లేమియు లేవు. గొప్పచిత్రకారు లందఱు చేతులను, చిత్రించుటయం దంతశ్రద్ధను వహింపలేదు. చెవులవలెనే వీటికిని అశ్రద్ధతో విడిచివేసిరి. అందువలన మన కేమియు ఆధారములు లేవు.

దీనికి కారణ మిది. ముఖ ముండినచోటున నివి సందర్భానుసారముగ నుండును. అందువలన వీటిని చిత్రించెదరు. మనకు కావలసినది ముఖమే. ఇ వంతముఖ్య మైనవి కావు. అందువలన వీటి నెవరును చక్కగ ప్రదర్శింప లేదు. ఆకారమును మాత్రము చూపినారు.

స్త్రీలచేతులు పురుషులచేతులకంటె సౌందర్యముగ నుండును. పురుషునకు వలలో త్రోయువాటిలో ఇవి కూడ ముఖ్య మైనవి. అందువలననే పలుచోట్ల మనపూర్వపుకవులు వీటిని మోహనాస్త్రములుగ వర్ణించిరి. వేండిక్కును (Vandyck) లారెన్సును (Lawrence) మాత్రము వీటిని బాగుగ చిత్రించిరి.

ఇంకొకసంగతిని గమనించవలసియున్నది. కుడిచేతితో స్త్రీలు సదా పని చేయుచుందురు. అందువలన నీచేయి కొంచెము మోటుచేరి యుండును. అందువలననే ఎడమచేతి సౌందర్యము హెచ్చు.

దుస్తులు:- వస్త్రములనుకూడ జుట్టువలెనే చిత్రించవలెను. మొదటప్రధాన మైనముడుతలను తేలికైన రంగుతో చిత్రించుట మంచిది. ఇవి సమముగా నున్న వని నీకు తోచినపుడు గాడముగ రంగులను వేసి ముడుతలను, ఛాయను, వెలుతురును చూపుట మంచిది.

బట్టలను ఉన్నితోను, పట్టుతోను, నారతోను, దూదితోను నేయుదురు. చూచినవెంటనే దేనితో చేయబడినదో పోల్చివేయుదురు. ఈభేదములను చిత్రములందు చూపవలసియుండును. వీటిముడుతలనుబట్టి సాధారణముగ మనము వీటిని పోల్చెదము. తరువాతను, ఛాయను, వెలుతురును, మెఱుపును, మనము విమర్శింపవలెను. ఈ యంశముల విషయమై కొంచెము జాగ్రత్తగ నుండవలెను. చిత్రమునందు చూచినవెంటనే దేనితో చేయబడినవస్త్రమో మనము పోల్చి వేయవలెను.

తెల్లవస్త్రములయొక్క ఛాయ వెనుకభాగముయొక్క రంగునుబట్టి యుండును. వెనుకభాగము ఆకుపచ్చగ నుండిన ఛాయయందు కొంచె మాకుపచ్చను వేయవలసి యుండును. వీ లైన యారంగు నుపయోగించుట యుక్తము.

నీలిబట్టరంగు కొంచెము రక్తవర్ణముగను, రక్తవర్ణమిశ్రిత మైనసిపియాగను ఉండును. ఊదామిశ్రిత మైన నీలిబట్ట ఛాయ నారింజరంగుగ నుండును. కొంచెము ఛాయయున్నచోటులయందు కోబాల్టు ఉపయోగపడును. నల్లనిలేసుయొక్క ఛాయయందు గాడ మైననీలి కలిసియుండును.