పుట:2030020025431 - chitra leikhanamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలమార్పును కలుగజేసెను. అప్పటినుండి మనవారు అంగరకాలను తొడుగ మొదలిడిరి. తురకల నిరంకుశపాలనమునందు హిందువులు చాలవఱకు పరిపాలకుల దుస్తులనే ధరించుచుండిరి. ఇక నిప్పటి సంగతిని చెప్ప నక్కఱయే లేదు. మనజాతీయదుస్తులను విడిచి పెట్టి దొరలమై పోవుచున్నాము. సిగరెట్టును, బ్రాందీని, ఉపయోగించుచున్నాము. కాని దొరలవలె మనము మాసనమునం దభివృద్ధి కాలేదే?

"హేటును, బూటును, నీటుగావేసిన తెల్లతో లెక్కడ తేగలడు"

అని యొకానొక కవి యిందువలననే చెప్పెను. ఇప్పు డీసంగతులు మన కెందుకు? ప్రస్తుతాంశమును చూడుడు.

ఇప్పటి దుస్తులను మనము ప్రేమించెదము. పూర్వకాలపువాటిని నిరసించుచున్నాము. అందువలన మనము రూపములను చిత్రించునప్పుడు యిప్పటిబట్టలను చిత్రించవలయును. ఎప్పటికిని మార్పుజెందనట్టిదుస్తుల నెంచి మనము వ్రాసినయెడల నన్నికాలములవారికిని సంతోషపుచ్చినవార మగుదుము. స్త్రీచిత్రమును వ్రాసినయెడల కోకను ధరించినటుల ప్రదర్శించిన బాగుగ నుండును. చిత్రలేఖకుని విమర్శనమున కీవిషయమును విడిచిపెట్టుటయే మంచిది. ఒకానొకప్పుడొకస్త్రీ సుప్రసిద్ధచిత్రకారుడగు రేనాల్డ్సు (Reynolds) వద్దకు వెళ్లి "నాప్రతిని చిత్రించు" మని యడిగెనట. అందుపైని యాతడు "దుస్తులపై యేయేరంగులను వేయవలె" నని యడుగగా నామె "ఏరంగులు ---------గలవి" అని ప్రశ్నించెను. "కారుమైను, ఉలమైను" అని చిత్రకారుడు ప్రత్యుత్తరమిచ్చెను. "అట్లయినయెడల నాదుస్తులను కారుమైనుతోను, నాభర్తయొక్కదుస్తులను ఉలమైనుతోను చిత్రింపుము." అని యామె కోరెను. పెద్దింటిస్త్రీలు మిగులప్రకాశమాన మైనరంగులబట్టలను ధరించుట కిష్టపడెదరని పైకథవలన మనకు తెలియుచున్నది. కాన వారివారి యిష్టములప్రకారము చిత్రకారుడు చిత్రించుటను నేర్చుకొనవలెను. ఛాయయొక్క నిర్మాణమును నేర్చుకొనుటకుగాను సర్ జోషువా రేనాల్డ్సు, వేనిక్కల (Sir Joshna Reynolds & Vandyck) చిత్రములను చూడుడు.

రేనాల్డ్సు, బాలురయొక్కయు, స్త్రీలయొక్కయు దుస్తులకు తెలుపును, ఎఱుపు మిశ్రిత మైననలుపును వేయుచుండెను. పురుషులబట్టలకు గాడమైనరంగుల నుపయోగించెను.

సాధారణముగ రేనాల్డ్సుకంటె వేండిక్కు గాడమైనరంగుల నుపయోగించుచుండెను. ఈచిత్రకారుడు ఎఱుపును, నీలిని, పసుపుపచ్చను, బరంటుశయనా (Burnt Sienna) ను, ఆకుపచ్చను, పర్పులు (Purple) ను ఉపయోగించెను. అప్పుడప్పుడు ఎఱుపుమిశ్రితమైన దట్టమైన నారింజరంగు నుపయోగించి నీలిని ఛాయయందు కొంచె ముపయోగించుచుండెను.

నీలివస్త్రములను స్త్రీలు ప్రేమించెదరు. కాని యీరంగును బాగుగ పూయుట ప్రథమమున కొంచెము కష్టమనిపించెను. రేనాల్డ్సు వెలుతురు పడుచోటులయం దిట్టిచిత్రములయందు ఎఱుపును పసుపును వేయవలె నని చెప్పెను. ఈవాక్యములను వ్యర్థపుచ్చుటకు గైన్సుబరో (Gainsborough) తనచిత్రమునం దిట్టిచోట్ల గాడమైన బరంటుశయనాను వేసెను. కొందఱు రేనాల్డ్సుగారి వాక్యములను పూర్ణముగ వ్యర్థపుచ్చిరనియు మఱికొందఱు అంత బాగుగ తమచిత్రముల వివిధముగ చిత్రించలేకపోయిరనియు చెప్పుచున్నారు.

ఇట్టిరంగులను వేండిక్కుగారు ఎట్లుపయోగించిరో కొంచెము చూతము. వస్త్రమునకు నీలిని పూసి దానిదగ్గర నున్నచర్మపుఛాయగ బరంటుశయనాను పూసి ఎఱుపు వెనుకభాగమును నిర్మించి చిత్రమునకు సౌందర్యము నిచ్చి కీర్తిగాంచెను.