పుట:2030020025431 - chitra leikhanamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొండెము కానరాదు. మొండెము లేదనికూడ చెప్పగలము. భూమిమట్టమువద్దనుండియే యనేకకొమ్మలుగ విడిపోయి తుప్పవలె పెరుగును. ఈకొమ్మలు సన్నముగను పొడవుగను ఉండును. విస్తారము పుష్పించుటకుగాను వీటికి సగమువఱకు నఱికివేయుదురు. అందువలన కోసివేయబడిన కొమ్మలను మన మనేకము చూచుచుందుము. అందువలననే యిది చాలకురుచగ పెరుగుచున్నది.

ఈతు ప్పంతటను వంకర యగుచిన్నముళ్లు పెరుగును. ఇంతచక్కనిపూవు లుండుచెట్టునకుగూడ ముళ్లుండవలెనా? ఆహా! ఎంతటివానికైనలోపము లుండకమానవు కదా!

దీనియాకులు చిన్నవిగను, సౌందర్యముగను ఉండును. ఈయాకుల యంచులు కరకుగ నుండును.

మామిడి, మఱ్ఱియాకులవలెగాక యివి ఆఱేసియాకులు గలసి యొకపెద్దయాకుగ తెలియబడుచున్నవి.

ఇవి నీలిమిశ్రిత మైనఆకుపచ్చనిరంగును కలిగియున్నవి. అందువలన నీతుప్పలు అన్నికాలములయందును గాడమైనరంగును కలిగియుండును. సాధారణముగా నొకపెద్దయాకునందు ఏడుచిన్నయాకు లుండును. కొన్నిసమయములయందు అయిదు మూడు చిన్నయాకులున్న పెద్దయాకును చూచుచుందుము.

పుష్పములు సాధారణముగ గులాబిరంగుగ నుండును. మృదువైన పుష్పదళము లనేకములు కలసి యొక పుష్పమగును. ఈచక్కనిమృదు వైనరేకులు చూచుట కెంతయో యానందకరముగ నుండును. దీనిపుప్పొడి పసుపు వర్ణముగ నుండును. ఈపుష్పమంతయు నొక యాకుపచ్చనిరంగు గలయండకోశముపై నిర్మింపబడియుండును.

పుష్పములు కొమ్మలకొనయందు గుంపులుగ నుండును. కొన్ని పుష్పించియుండును మఱికొన్ని మొగ్గలుగనే యుండును. కొన్ని అప్పుడే పుట్టుచుండును. ఇట్టికొమ్మను వ్రాసిన నెంతయో చక్కగ నుండును.

అనేకవిధము లైనగులాబిజాతు లున్నవి. కొన్ని పాదవలె ప్రాకును. వీటియందు పసుపువర్ణము గలపుష్పములు పుష్పించును. ఇటులనే బ్రహ్మజెముడు, కొబ్బరి, యీతచెట్టు మొదలగువానిని చూచుచు వ్రాయుచుండవలెను. ఎట్టివి యెటుల మీరు గమనింపవలయునో యిందు చెప్పితిని. కాని విపులముగ తెలిసికొనవలె నన్న వృక్షశాస్త్రమును చదివిన బోధపడును. చదివినంతమాత్రమున లాభము లేదు. ఈపుస్తకమును మీహస్తంబున నిడికొని ఆయాచెట్టును చూచుచు చదివిన లాభకరముగ నుండును.

ఇంకొకయంశమును చెప్ప మఱచితిని. చెట్లవిషయమై నే నింతవిపులముగ జెప్పినందులకు నన్ను నిందించ వలదు. సృష్టికి సౌందర్యము నిచ్చునవి చెట్లు. అందువలన మనము ప్రదేశచిత్రములను వ్రాసినయెడల చెట్లను సౌందర్యముగ చిత్రించవలసియుండును.

చిత్రలేఖనమునందు మంచిప్రావీణ్యము కలుగజేసికొనవలెనని యెల్లప్పుడును పుస్తకములను డ్రాయింగు పరికరములను వెంటను కొనిపోవలెను. ఎచ్చట దేనిని చూచిన దానిని చిత్రమును వ్రాసివేయుచుండవలెను. గోవులు మేయుస్థలమునకు పోయి చూచినయెడల మన మనేకవిధములైన యవస్థలలొ వాటిని చూడగలము.కొన్నిశయనించి యుండును. మఱికొన్ని మేయుచుండును. కొన్ని నిలువబడియుండును. పరుగెత్తునటుల, నడచునటుల మనమువాటిని చూతుము. అట్టిసమయమునందు వాటిని చూచి వ్రాయుచుండిన నెంత యభ్యాసము కలుగునో యాలోచింపుడు.

ఇటులనే మనుజులను, గుఱ్ఱములను, గాడిదలను, కుక్కలను వ్రాయుట నభ్యసింపవచ్చును. అట్టిచిత్రములను పారవేయక జాగరూకతతో నుంచిన ప్రదేశచిత్రములను వ్రాయునప్పు డివి యన్నియు మన కెంతయో యుపయోగకరముగ నుండును. పైజెప్పినవిధముననే యనేకవిధము లనవృక్షములను వ్రాయుట నభ్యసించిననేకదా ప్రవీణులము కాగలుగుదుము.

ఒక జలప్రవాహ మున్నది. దానిప్రాంతములయందు వివిధవృక్షము లున్నవి. ఆవృక్షముల నీడయందు ఒకబాటసారి విశ్రమించియున్నాడు. కొంతదూరమున కొందఱుపిల్ల లాడుకొనుచున్నారు. మఱియొక----------