పుట:2030020025431 - chitra leikhanamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

చిత్రలేఖనము


ఛాయాపటములను పెద్దవిగ వ్రాయుటకు కావలసిన పరికరములు.

(1) వాట్టుమేన్సు డ్రాయింగు కాగితము .(Whatman's Drawing Paper)

ఈ డ్రాయింగు కాగితమును ఎంచుకొనుటయందు జాగ్రత్తను వహింపవలెను. ఈ కాగితములలో కొన్నినున్నగ నుండును. మఱికొన్ని గరుకుగానుండును. ఇందు నున్నని కాగితమే మనకు కావలయును. రెండువైపుల నొక్క తీరున నుండదు. అందువలన మనము వ్రాయుటకు యోగ్యమైన ప్రక్క నెంచుకొనవలయును. దీనిని తెలుసికొనుటకు కాగితమును నెలుతురువైపు పెట్టి చూచినయెడల సులభముగ తెలిసిపోవును. కాగితమునందు తెల్లని యక్షరములు ముద్రింపబడియుండును. ఆయక్షరములు సమముగ కనబడిన నదియే మంచివైవని నిర్ణయింపవలెను, తిరిగిపోయి నటుల కనబడిన నది మంచిప్రక్క కాదని తెలియునది.

ఇట్లు డ్రాయింగు కాగితము నెంచుకొని దానిని (2) డ్రాయింగుబల్లపై నంటింపవలయును. ఇది దేవదారుతో చేయబడి నున్నగ నుండవలెను. అంటించునప్పుడేమియు ఒగ్గులు రాకుండ చూచుకొనవలెను. (3) గట్టిపెన్సిలు నొకటి జాగ్రత పెట్టవలయును. దీనికి ఎ. డబుల్యూ, ఫీబరు; హెచ్చు (A. W. Faber. H.) నెంబరుగల పెన్సిలు యోగ్యముగ నుండును. (1) మెత్తని పెన్సిలొకటి కావలసియుండును. (5) బాగుగ చెరుపురబ్బరు చాలముఖ్యము.

ఇక వ్రాయుటకు ప్రారంభింతము. 23 - 1&2 చూడుము.

ఛాయాపటము నొకదానిని తీసికొని దానిమీదను సమముగా పెన్సిలుతో చదరములను వ్రాయవలయును. మన మద్దాని నెన్నిరెట్లు పెద్దదిగ చేయవలయునో నిశ్చయించుకొనవలయును. పిమ్మట మనయుద్దేశము ప్రకారముగగీతలను పెద్దవిగచేసి వ్రాసికొనవలయును. చిన్నపటములో గీతలకు దూరము 2 యించీలున్నయెడల పెద్దపటములో 3 యించీల దూరముంచి గీతలను వ్రాసిన ఒకటిన్నరమార్లు పెద్దదియగును. 1 ఇంచీల దూరముంచి గీతలను వ్రాసినయెడల రెట్టింపగును. ఈవిధముననే యెంత పెద్దదిగ వ్రాయవలయునన్న నంత పెద్దదిగ చేయవచ్చును. (నాలుగైదు నిడివిగీతలకు మధ్యను, నాలుగు అయిదు అడ్డగీతలకు మధ్యనున్నది)

మఱియొకమారు 23 - 1&2 చిత్రములను చూడుడు. కుడికన్ను రెండు, మూడు నిడివిగీతలకు మధ్యను, రెండు, మూడు అడ్డగీతలకు మధ్యనున్నది. దీని నిటులనే పెద్ద చిత్రమునందు వ్రాయవలెను. ఇటులనే అన్నిగీతలును యేయే చదరముల మధ్య నేభాగముమీదనుండి పోవుచున్నవో జాగ్రత్తగ గమనించి అటులనే పెద్దచిత్రమునందును వ్రాయవలయును. ఇటు లంతయు వ్రాసినతరువాత ననవసరమైన గీతలను మెల్లగ చెఱిపివేయవలెను. తరువాతను జాగ్రత్తగా ఛాయను వ్రాసికొనిరావలెను. ఈకార్యము మెత్తని పెన్సిలుతో చేయవలెను. ఈపెన్సిలు చాలమెత్తగను నల్లగను వ్రాయుచుండవలెను. ఇట్టిపెన్సిలునుతీసికొని ఛాయను జాగ్రత్తగ వ్రాయవలెను. కొంచెము తప్పిపోయినయెడల రూపమంతయు మాఱిపోవునని యిది వఱకే చెప్పియుంటిని. ఇందు చాల యభ్యాస ముండవలెను. లేనియెడల నెంతమాత్రమును వ్రాయజాలరు.

ఇంకొకసంగతిని గమనింపవలెను. ముఖమునంతను చక్కగ వ్రాసివేయవచ్చును గాని ముఖముయొక్క భావమును తెచ్చుట దుర్లభము. కొన్నిసమయములయందు విచారముగ కనబడును. కొన్నిసమయములయందు సంతోషముగ కనబడవచ్చును గాని మూలచిత్రమున నున్నకళ రాకపోవచ్చును. ఇందే విస్తారము కష్టము కలుగును.