పుట:2030020025431 - chitra leikhanamu.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ ప్రకరణము.

వృక్షములు:- మొదట మెత్తని పెన్సిలును తీసికొని చెట్టుయొక్క ఏభాగమునందు ఎక్కువనీడ యున్నదో దానిని వ్రాసి పిమ్మట వెలుతురు పడుచున్న భాగములను వ్రాయవలయును. తరువాత కొమ్మలు పైకివచ్చునటుల జాగరూకతతో వ్రాయవలెను. పిమ్మట మొండెమును చిత్రింపవలయును. 6 - 1 చూడుము.

కొన్నికొన్ని సమయములయందు కొమ్మలు కాన బడును. వీనిని వ్రాయుటయందు జాగరూకత గలిగియుండవలెను. చెట్టుయొక్క మొండెము మిగుల పెద్దదిగ నుండి కొమ్మలంతకంతకు సన్నమైపోవును. 6 - 2 చూడుము.

అనేకజాతుల చెట్లున్నవి. మఱ్ఱిచెట్టు పొట్టిగను దట్టముగను ఉండును. మునగచెట్టు పలచగ నుండును. కొన్ని చెట్లయం దచ్చటచ్చటమాత్ర మాకు లుండును. కొబ్బరిచెట్టుయొక్క కొనయందే ఆకు లుండును. వివిధజాతుల చెట్లను వ్రాయుటయందు వానివానికిరూపును ప్రదర్శించుచు వ్రాయవలెను. 6 - 3 & 1 చూడుము.

తుప్పలయొక్క మొండెము కానరాదు. 6 - 5 చూడుము.

దూరమున నున్న చెట్లసమూహమునందు కొమ్మలుకాని విడివిడి చెట్లుకాని కానబడవు. 28 - చూడుము.

ఆకు లనేకవిధములు. బాలునిచేతి కొకయాకు నిచ్చి దాని రూపమును వ్రాయింపవలెను. ఇది బాగుగ వచ్చిన తరువాత కొమ్మలను వ్రాయవలెను. 7 - చూడుము.