పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 100

పాలనతో నూతనాధ్యాయ మొకటి ఆంధ్రసారసత్వమున నేర్పడినది. పాశ్చాత్యులు పరిభాషను తెలుఁగును నేర్చుకొనుటకు సులభమగు పద్ధతు లవలంబించుటచే వ్యావహారిక భాషకే గాని గ్రాంథికభాషకు నాస్కారము లేకపోయినది. ప్రాచీన గ్రంథములు సంస్కరింపఁబడినను నవి వ్యావహారికరీతిగా నుండుటచే ప్రాచీనసాహిత్యమునకు భాషాలక్షణములకు పండితులే కొంచెము సుదూరముగ నిలువవలసిన దశ యేర్పడినది. ఇట్లు వ్యావహారికపంక నిమగ్నమైన యున్నతపరిస్థితులలో చిన్నయసూరి యుదయించి సలక్షణమును, శాస్త్రసమ్మతమును, శాశ్వతమును నగు వైయాకరణ సంప్రదాయమును సుప్రతిష్ఠము గావించి తన్మూలమున గ్రాంథికవాఙ్మయప్రపంచమును పునరుద్ధరించినవాఁ డయ్యెను. ఇంతేకాక నవయుగవికాసమునకు తోడ్పడిన యుద్యమములయం దీతఁ డెట్లు పాల్గొన్నదియు నీతని రచనలే యుద్ఘోషించుచున్నవి.

ఆంధ్రవాఙ్మయప్రపంచమున నజరామరమును, నాచంద్రార్కము నగు యశస్సు సంపాదించి ప్రాచీనులగు నన్నయాది కవులతో తులతూగఁదగినవాఁ డీతఁ డొక్కఁడే. చిన్నయసూరి ప్రభవసంవత్సరమున (1806) ప్రభవించినాఁడు; దుందుభి సంవత్సరమున (1862) కీర్తిశేషుఁ డైనాఁడు. వాఙ్మయ ప్రపంచమున నాతని యశోదుందుభి నేఁటికిని రేపటికిని మాఱుమ్రోఁగుచునే యుండును.