పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 96

నన్నయభట్టారక రచితమైన పద్యభాగమును దాని కెదురుగా వేఱొకపుటయందు ఈ వచనమును ముద్రితమైనవి. ఈ వచనమును సూరి సంస్కరించియున్నాఁడు. ఆ గ్రంథము ముఖపత్రమున నిట్లున్నను తరువాతివారు దీనిని సూరి రచనముల యందు చేర్చుట శోచనీయము. (చూడుడు: ధాతుమాల పీఠిక). ఈ గ్రంథమునకు చిన్నయసూరి సంస్కార ముండుట చేతను, నీతిచంద్రికకన్న ప్రథమ వచనగ్రంథమగుటచేతను నిది తిరిగి ముద్రితము కావలసియున్నది.

3. వింజమూరి కృష్ణమాచార్యులు: ఈతఁడు అలంకారశాస్త్రమున ప్రత్యేకపండితుఁడై భట్టుమూర్తి రచితమైన కావ్యాలంకారసంగ్రహమును టీకాతాత్పర్యములతో ప్రకటించెను. ఇతఁడు కొంతకాలము పచ్చయప్ప కళాశాలలోను, ప్రభుత్వమువారి బోధనాభ్యసనపాఠశాలయందును పండితుఁడై యుండెను.

4. కరాలపాటి రంగయ్య (1819 - 1863): ఈతఁ డాకాలమున సుప్రసిద్ధాంధ్ర పండితులలో నొకఁడు. సూరి కీతఁడు సమకాలికుఁడు. భూతపురీ మహాత్మ్యము, కవి జన మనోహరము అను రెండు కావ్యములను రచించెను. ఈతఁడు మొట్టమొదట తాళపత్రములనుండి పాఠాములు సంస్కరించి మహాభారతము, భాస్కర రామాయణము, రంగనాథ రామాయణము మున్నగు గ్రంథములను ముద్రింపఁజేసెను. ఈతఁడు చిన్నయసూరితో కొంతకాలమును, నా వెనుక నొక వత్సరమును రాజధానికళాశాలలో పండితుఁడుగా నుండెను.