పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


12. పద్య రచన

చిన్నయసూరి కేవలము వచనరచనా సంప్రదాయము నెలకొల్పిన విద్వాంసుఁడే కాక ప్రశస్తమగు పద్యరచనా సంప్రదాయమును నిలిపిన విద్వత్కవి. నిఘంటు పదముల సేకరించుటకు బహు మహాగ్రంథములను కూలంకషముగ పరిశోధించుటచేత సూరికి సలక్షణమును, సరసమును నగు కవితా ధోరణి యలవడినది. ఒక మహాకావ్య మేదైన వ్రాయుటకు నాతనికి తగిన యవకాశము లభింపలేదు. కాని ప్రాస్తావికముగ నాతని కవితానైపుణ్యమును ప్రదర్శించుటకు తగిన సందర్భములు తటస్థింపకపోలేదు. వీనిలో మొదటిరచన "రాణిగారి మకుటాభిషేకమునకు రచించిన పద్యములు." ఇవి విక్టోరియాచక్రవర్తిని క్రీ. శ. 1837 - వ సంవత్సరమున సింహాసన మధిష్ఠించి నప్పుడు చిన్నయసూరి రచించిన పద్యములు. ఈ పద్యములు మనకు లభింపలేదు. ఆకాలమునందు నిట్టి పద్యరచనలను ప్రకటించుటకు పత్రికలును లేవు. అప్పటి కింకను కంపెనీవారి పరిపాలనయే వర్తిల్లుచుండుటచేత ప్రభుత్వమువా రాపద్యములను ప్రకటింపలేదు. తర్వాతి పద్య రచనలలో పేర్కొనఁదగినవి పచ్చయప్పమొదలిమీఁద వ్రాసిన పద్యములు. సూరి తెలుఁగుపద్యరచనయందేకాక, సంస్కృత శ్లోక రచనయందు నసమానుఁడు. ఇందు పొందుపఱచిన రచనల వలన నాతని కవితా కమనీయత తేటపడును.