పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


8. బాలవ్యాకరణము

నేఁటికాలమున తెనుఁగుభాషకు బాలవ్యాకరణము పరమ ప్రామాణికగ్రంథ మని యాంధ్రవిద్వాంసు లెల్లరు నేకగ్రీవముగా నామోదించి యంగీకరించిన విషయము. బాలవ్యాకరణ మెట్లు ప్రాచీనభాషాసంప్రదాయములను నిలువఁబెట్టినదో, నవీనకాలమున నావ్యాకరణమునుబట్టి భాషాతత్త్వసంప్రదాయములను, భాషాపరిణామములను నెట్లు - తెలిసికొనఁగలమో, యావిషయములన్నియు నెఱుంగుటకు మనము తొలుత నాంధ్రవ్యాకరణములచరిత్ర పరిశీలింపఁదగియున్నది.

ఆంధ్ర, సంస్కృత వ్యాకరణములు

తెనుఁగుభాషకుఁ బ్రాచీన కాలమునుండియు వ్యాకరణములు కలవు. "మాట పుట్టినవెనుక వ్యాకరణము, పాట పుట్టినవెనుక ఛందస్సు" అను నానుడి ననుసరించి భాష యేర్పడిన వెనుకను, కవితారచన కనంతరమునను వ్యాకరణములు రచితములగును. భాష ప్రవాహరూప మైనది. ఇది ప్రజల పలుకుబడిలో శీతోష్ణస్థితి భేదముల ననుసరించి, సాంఘిక వ్యవస్థల ననుసరించి, రాజకీయపరిస్థితుల ననుసరించి క్షణక్షణమును మార్పుఁ జెందుచుండును. అట్టి మార్పుల వలన భాష తన నైసర్గిక స్వరూపమును కోల్పోకుండ భాషాతత్త్వవేత్తలు వ్యాకరణమును రచింతురు. తెనుఁగుభాషకు నట్టివ్యాకరణములు