పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 54

ర్థమునకు హేతువు" అను నీతిని బోధించు ముసలి పులి - బాటసారి కథ చెప్పఁబడినది. పిమ్మట మృగ కాక జంబుకముల కథ "సర్వ విధముల విచారింపక యేపనియు చేయరాదు" అను నీతి నుద్ఘోషించుచున్నది. ఈ కథలోనే (అనఁగా మృగ కాక జంబుకముల కథలో) "కొఱగానివారితో మైత్రి విపత్తునకు కారణ" మనుదానికి దృష్టాంతముగా మార్జాలమునకు జరద్గవమను గృధ్రము తావిచ్చి మృతిఁబొందు కథ పొందుపఱుపఁ బడినది. మూలకథ నడచుచున్న కొలఁది నింకను మూఁడు కథలు లోభిత్వమే వినాశహేతువు అను నీతికి ననుసరణముగా రచితములైనవి. ఇవి వీణాకర్ణ చూడాకర్ణుల కథ (మూషికము యొక్క స్వవృత్తాంతము), జంబుకము - వింటినారి కథ, చిత్రాంగుఁ డను జింక తన పూర్వవృత్తాంతమును కాక కూర్మ మూషికములకు చెప్పుట. ఇంతటితో మిత్రలాభ మందలి కథలు సమాప్తము లగుచున్నవి.

ఇఁక మిత్రభేదము పింగళక సంజీవకము లను సింహ వృషభముల కథతో ప్రారంభమగుచున్నది. ఇందు కథాసూత్రమును నడిపించువారు కరటక దమనకు లను జంబుకములు. వీ రిరువురి సంభాషణయందును నీక్రిందికథలు ప్రసక్తములైనవి. పింగళ సంజీవకములకు ప్రథమమున మిత్రత్వము నేర్పఱచి తుదకు భేదమును కలిగించుట కీ కరటక దమనకులే కారణ భూతులు. కావున నట్టివా రేవిధముగా ప్రవర్తించి కార్యాను కూల్యము చేయవలయునో యాపద్ధతులను లోకమునకు విశదమొనర్చుటకు నీకథలావశ్యకము లైనవి.