పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 48

4. ఈ శైలియొక్క వేఱొకలక్షణము సామెతల నుపయోగించుట. "అడుసుత్రొక్కనేల కాలుగడుగనేల," "పిట్ట కొంచెము కూఁత ఘనము" మున్నుగాఁగల తెనుఁగు సామెతలును, "శరీరమాద్యం ఖలు ధర్మసాధనం," "యథా రాజా తథా ప్రజా," "జీవన్ భద్రాణి పశ్యతి" మొదలగు సంస్కృతలోకోక్తులును నందందు పొందుపఱుపఁబడి గ్రంథమున కొక క్రొత్తయందము నందించుచున్నవి.

5. చిన్నయసూరికిముందు వచనరచనలలో పాశ్చాత్యులు సులభముగ గ్రహించుటకు నచ్చటచ్చట సంధి క్రమముగ పాటింపఁబడియుండలేదు. సూరి వ్యాకరణము రచించినవాఁడు గావున సంధిపరిచ్ఛేదములోని లక్షణములకు లక్ష్యముగా నీగ్రంథమున సంధులను సక్రమముగా పాటించియున్నాఁడు. ముందుదాహరింపఁబడిన గురుమూర్తిశాస్త్రిగారి రచనను, చిన్నయసూరి రచనను పరిశీలించిన నీవిషయ మింకను స్పష్టము కాఁగలదు.

6. పూర్వవచనగ్రంథములలో ప్రబంధరచన ననుసరించి వర్ణనలు ఔచిత్యమును పాటింపకుండ రచియింపఁబడుచుండెడివి. అందు శృంగారవర్ణనల నధికముగా పొందుపఱచెడివారు. నవీనకాలమున కళాశాలపద్ధతుల ననుసరించి యిట్టివర్ణనలు పరిత్యజించుటయేకాక చిన్నయసూరి సముచితమును, సంభావ్యము నగు సంభాషణశైలిలో నీతిచంద్రికను రచించెను.