పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 47

తుదివఱకు నొకేరీతిని, నిమ్నోన్నతములు లేక యొప్పారును. కేవలము దీర్ఘసమాసయుక్తము లగు పంక్తులుగాని, కేవల మచ్చ తెనుఁగుపదములు విచ్చలవిడిగ నున్న పంక్తులుగాని కానరావు. ఈ శైలియందు నన్నయశైలివలె ప్రసన్నతయు, ప్రసాదగుణమును, గాంభీర్యమును ముప్పిరిగొనియున్నవి.

2. ఇందు సంస్కృతాంధ్రపదములు సమపాళముగ సమ్మిళితములైనవి. ఇందలి శైలి తేలిక యని పేలవముగాదు; తెనుఁగని సంస్కృతసంపర్కము లేకయుండలేదు. అల్లికబిగియని యపూర్వపదబంధురముగాదు. అనుసృతి కలవీయదు.

3. ఇచట ప్రత్యేకత తెలుపువానిలో జాతీయములు ముఖ్యములు. అవి జాతికి సహజమైన వ్యక్తిస్వరూపమును తెలుపుచు నితరభాషలలోనికి పరివర్తనము చేయుటకు సాధ్యము కానివి. "పోతరించియుండుట, యిల్లుద్రొక్కుకొనివచ్చుట, బిఱ్ఱ బిగిసికొని, కడుపుపని, కాలక్షేపముచేయు, మొదలు నఱికిన తరువు, కన్నులు మిఱుమిట్లుగొలుపుట, పెండ్లినడక నడచుచున్న వాఁడు, చిటుకనకుండ కొఱుకుట, నిన్న మాపో నేఁడు ఱేపో, యీడిగలబడిన బక్కయెద్దు, చియ్యబట్టు, అఱ్ఱాడు, ఎత్తువారిచేతిబిడ్డ, పాటెఱుఁగనిదొర" మొదలగు తెలుఁగు జాతీయములు, "పయోముఖవిషకుంభము. గోముఖవ్యాఘ్రము, కుక్షింభరిత్వము, పరేంగితావగాహియైనబుద్ధి, మృగతృష్ణికాప్రవాహము" మున్నగు సంస్కృతజాతీయములు రచనయం దంతటను మెండుకొనియుండును.