పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 46.

రచించిరి. ఎవ రెన్ని విధములుగ రచించినను చిన్నయసూరి గ్రంథమునకుండు విశిష్టత మఱెవరి రచనకును రాలేదు. ఇంత విశిష్టతకు కారణ మెదియో ముందు తెలిసికొందము.

నీతిచంద్రిక యొక విడికథల సంపుటమైనను వీనిలో నొకటి కొకటి యంగాంగిభావసంబంధము గల్గి కథాశరీరము స్ఫుటమగునట్లుగా రచితమైనది. దీనివలన గ్రంథమం దొక యైక్యభావ మేర్పడి చదువరులకు రాఁబోవుకథలను జదువుట కాతురతను గల్గించును.

విషయ విభజనము

కథారచనయం దొక్కొక్క భావము, లేక విషయమునకు వేర్వేఱు 'పేరా'లను విభాగించు పద్ధతిని పాటించినవాఁడు చిన్నయసూరి. తత్పూర్వగ్రంథకారు లింత విశదముగా నీ నియమమును పాటించియుండ లేదు. ఆంగ్ల వచన రచనాపద్ధతి ననుసరించి చిన్నయసూరి విషయము సుబోధకమగుటకు నీ నూతన పద్ధతిని ప్రవేశపెట్టినాఁడు. చిన్నయసూరి కళాశాలపండితుఁడు కావున విద్యార్థులుకూడ నీపద్ధతి నలవఱచుకొనునట్లు దారితీసి యీ పథకము వ్యాప్తిలోనికిఁ దెచ్చెను. నేఁటికిని వ్యాస రచనయందు నీపద్ధతి నియతముగా పాటింపఁబడుచుండుట మన మెఱిఁగినదే కదా!

శైలి లక్షణములు

1. ఇందలి శైలి యతి కఠినముగను, నతి సులభముగను కాక సుగ్రాహ్యమై కమ్మెచ్చులోని తీఁగవలె మొదటినుండి