పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 44

భాషా రూపములు కాన్పించుచున్నవి. కొన్ని యెడల విసంధులు కూడ కానఁబడుచున్నవి. వాక్యములయందు అన్వయక్రమము గూడ సరిగ లేదు. 'సెలవు చేయుట' మొదలగు మాండలికములుకూడ నందందు కాన్పించుచున్నవి. ఇట్టి లోపముల నివారించి చిన్నయసూరి సలక్షణమును, సర్వజన గ్రాహ్యము నగు శైలిలో మిక్కిలి కట్టుదిట్టముగ తన గ్రంథమును రచించెను. అందలి ప్రత్యేక లక్షణములను ముందు వివరించెదను.

చిన్నయసూరి యీ నీతిచంద్రికను మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము అను నాలుగు విభాగములుగా విభజించినాఁడు. అందు మొదటి రెండు భాగములను మాత్రమే యాతఁడు రచించి క్రీ. శ. 1853 - వ సంవత్సరమున తాను స్వయముగ స్థాపించిన 'వాణీ దర్పణ' మను ముద్రాక్షరశాలయందు ముద్రింపించియున్నాఁడు దీనిని సూరి తన కింతవఱ కభ్యుదయ కారకుఁడగు ఆర్బత్ నాటు దొరగారి కంకితము గావించినాఁడు. ఈ గ్రంథము ముద్రితమైననాఁట నుండి పఠనీయగ్రంథమై బహుళ ప్రచారము గాంచి విద్వజ్జనరంజకమైనది. సంధి విగ్రహము లను మిగిలిన రెండు భాగములను చిన్నయసూరి రచింపక పోవుట మన దురదృష్టమని చెప్పవచ్చును. కాని మఱి యిరువది యేండ్లలోపుననే యా కొఱఁత మనకు తీఱినది. క్రీ. శ. 1871 లో చిన్నయసూరి వెనుక రాజధాని కళాశాలయం దాంధ్రపండిత పదవి వహిం