పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 43

చిన్నయసూరి రచనయందలి ప్రత్యేకతను చూపుటకు నిర్వురి రచనలనుండియు సమానఘట్టముల నుదాహరించుచున్నాను:

"ధనము లేకుంటే ఆర్జింపవలయును. ఆర్జించిన ధనమును రక్షింప వలయును. రక్షించిన ధనమును వృద్ధిపొందింపవలయును. వృద్ధిపొందించిన ధనమును సద్వినియోగము చేయవలయును. ఇట్లు చేయ నేరనివారి యింట ద్రవ్య మెట్లు నిలుచును? మూఢులైనవారు యీ యర్థమును తెలియ నేరరు. సంరక్షణసేయని ద్రవ్య మప్పుడే నశించును. వృద్ధిబొందించని ధనము కొంచెముగా *[1] సెలవుచేసిన కాటుకవలె సమసిపోవును. అనుభవమునకు రాని సొమ్ము కలిగియు లేనిదానివలె సుఖకరముగాదు. ఒకరి కివ్వడము, తా ననుభవించడము, యెవరైన యెత్తుకొనిపోవడము, యీ మూఁడున్ను ధనము పొయ్యేటందుకు దోవలు. కాఁబట్టి యెవఁడు తన ధనము నొకరి కివ్వక తా ననుభవించఁడో వాని ధనమును యెవరైన యెత్తుకొనిపోదురు. నిండిన చెరువులకు అలుగులు తీసినట్లు సంపాదించిన ధనము పాత్రమెఱిఁగి సెలవుచేయుట రక్షించడమేను."

ఇది గురుమూర్తిశాస్త్రిగారి శైలి. ఇఁక చిన్నయసూరి గారిశైలి నుదాహరించుచున్నాను:

"అర్థము పురుషార్థములలో నుత్తమము. అర్థవంతున కసాధ్యము లోకమం దేదియుఁ గానము. కాఁబట్టి పురుషుఁడు న్యాయము తప్పక యే యుపాయముచేతనైనను ద్రవ్యము సంపాదింపవలెను. ఇంత సంపాదించితి నిం కేల యని తనియరాదు. బుద్ధిమంతుఁడు జరామరణములులేని వానివలె విద్యాధనములు గడియింపవలె నని పెద్దలు చెప్పుదురు. ధనార్జనమునకు సాధనములు పెక్కులు గలవు. వాని లోపల వాణిజ్యము సర్వ ప్రకారములచే మేలయి కానఁబడుచున్నది."

పై రెండింటిలో గురుమూర్తిశాస్త్రిగారి రచనలో "లేకుంటే, చేసినా, రక్షించడమేను" మొదలగు వ్యావహారిక

  1. * 'సెలవు' తమిళము. 'ఖర్చు' అని దీని కర్థము.