పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 42

పారసీక భాషలలోనికిని అనువదింపఁబడియుండెను. రెండును సంస్కృత శ్లోకములతో, మధ్య మధ్య వచనములతో నొప్పుచున్నవి. హితోపదేశమున కేవలము నీతి కథలు మాత్రమే పొందుపఱుపఁబడియున్నవి. కాని పంచతంత్రమున నీతిమాత్రమే కాక రాజనీతికూడ ప్రపంచితమైయున్నది. పై రెండు గ్రంథములలోని విషయములను చిన్నయసూరి పరిశీలించి కావలసిన యంశములను తీసికొని కొంత క్రొత్తఁదనమును కల్పించి 'నీతి చంద్రిక' యను పేర వచనముగ రచించెను.

పంచతంత్రము పద్యకృతిగా చిన్నయసూరికి ముందు నలుగురుకవులు రచియించిరి. వారిలో ప్రాథమిక రచయిత కృతి లభ్యముకాలేదు. తక్కినవి - దూబగుంట నారాయణకవి, బైచరాజు వేంకటనాథకవి, భానుకవి యనువారు రచించినవి - లభ్యమగుచున్నవి. అవి యన్నియు, కావ్యపద్ధతిని ప్రౌఢరీతి నుండి పండితులకుమాత్రమే యుపయుక్తములైనవి.

నవీనయుగమున వచనరచన ప్రాముఖ్యములోనికి వచ్చుచుండినకాలమున శ్రీ రావిపాటి గురుమూర్తిశాస్త్రిగారు సులభవచనశైలిలో నీగ్రంథమును రచించియుండి రని ముందే తెల్పఁబడినది. కాని యాగ్రంథ మున్నతవిద్యార్థి జనోపయోగము గామింజేసియు, నుత్తమసాహిత్యమున కనుకూలింపమింజేసియు నా లోపములకు తీర్చుటకు చిన్నయసూరి గంభీరమును, లక్ష్యలక్షణసమన్వితమును, విద్యార్థిజనాకర్షణీయమును నగు శైలిలో తన నీతిచంద్రికను రచించెను.