పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 38

చేసిన చోట సంస్కృతపదము లుపయోగించి పై సంప్రదాయమును కొంతవఱకు పోషించిరి.

తెనుఁగున మొదటి వచనగ్రంథములని చెప్పఁదగినవి కృష్ణమాచార్యుని 'సింహగిరినరహరివచనములు', 'శఠగోప విన్నపములు', గ్రంథకర్త కాకతీయ రాజగు ద్వితీయప్రతాపరుద్రుని కాలములో, క్రీ. శ. 1300 ప్రాంతమున నుండెను. ఇతఁడే వచనవాఙ్మయప్రథమాచార్యుఁడు. కాకతీయుల వెనుక శ్రీనాథయుగమున, నావెనుక కృష్ణరాయలయుగమున ప్రబంధవాఙ్మయమే యపారముగా పెరిఁగినది. ఆకాలములో కొన్నివచనగ్రంథములు పుట్టినను నవి కేవల శాస్త్రవిషయములనే బోధించుచు వ్యావహారికరూపమున నుండినవి. క్రీ. శ. 1600 వఱకును వచనరచన పైరీతిగనే వెలయుచుండెను.

దక్షిణాంధ్రవాఙ్మయము - వచనరచన

సలక్షణమగు గ్రాంథిక వచనరచన సమీచీనముగా ప్రారంభమైనది దక్షిణదేశమున, మధురనాయకుల కాలమునుండి యని చెప్పనొప్పును. ఈ దేశమున తంజావూరు మధుర ప్రాంతములను తెలుఁగునాయకు లేనినను నచ్చటి వ్యవహారభాష తమిళముగాని తెనుఁగు కాదు. కాఁబట్టి యా నాయకులతో నచ్చటనే నెలకొనిన తెలుఁగు రాజకీయోద్యోగులకును, కవులకును, పండితులకును, తక్కినవారికిని మాతృభాష తెనుఁగైనను నిత్యవ్యవహారమున తమిళభాష తప్పనిసరియైనది. అయినను, పాలకులు తెలుఁగువా రగుటచేత వచన రచన యందు నొక ప్రత్యేకలక్షణము ప్రవర్థిల్లినది. ఆంధ్రదేశము