పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


6. వచన రచన

తెనుఁగుభాషలో నవ్యయుగవికాసమునకు ముఖ్య చిహ్నమగు వచనరచనయందు చిన్నయసూరి యందెవేసిన చేయి. ఆంధ్రవచన వాఙ్మయమున చిన్నయసూరిరచన యొక ప్రత్యేక ఘట్టమగుటచేత నంతకుముందు ప్రవర్తిల్లిన వచన వాఙ్మయస్వరూపము నెఱుఁగుట మనకు కర్తవ్యము.

తెలుఁగు వచనరచన - పూర్వస్థితి

ఏవాఙ్మయమునందై నను తొలుత పద్యవాఙ్మయమే పరిణతి కెక్కును. వచనవాఙ్మయము కాలక్రమమున రాజకీయసాంఘికాది వ్యవస్థలనుబట్టి పరిణామముపొంది విపులభావవిన్యాసరూపమున శాఖోపశాఖలుగా వృద్ధిపొందును. భావములను సులభతరమగు రచనారూపమున పొందుపఱుచుటకు వచనమే ప్రధాన సాధనము. తెనుఁగున పద్య, వచన సమ్మిళితమగు చంపూకావ్య పద్ధతియే కవులకు నాలంబన మైనది. అందునను వచన మనఁగా నేఁటివలె కేవలము భావప్రకటనకై కూర్చిన వాక్యసముదాయములు కావు. ఆ వచనము తాళలయానుగుణముగా నడచుచు పాటగా పాడుటకు వీలుగా నుండెడిది. వచనమైనను 'వృత్త గంధి', అనఁగా వృత్తమువలె వాసింపఁ జేయునది. యనఁగా చదువ మొదలిడఁగానే పద్యపాద మను లక్షణము కలిగియుండెడిది. ఈ పద్ధతి ననుసరించియే నన్నయభట్టారకుఁడు తన భారతమున వచనము మొదలిడినపుడు పద్యపాదమువలె తోపింపఁ జేసియున్నాఁడు. తరువాతి తిక్కనాదికవులు వర్ణనలు