పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 35

ఆంగ్లేయభాష యుత్తమసాహితీశిక్షణకొఱకేకాక, పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య దేశములతో సంబంధము మనకు కలుగుట కనుకూలించినది. ఆ భాషాపరిజ్ఞానముకలవారికే ప్రభుత్వమున నున్నతోద్యోగములు, అధికారపదవులు లభించుటచే చెన్నపురమునందును, నితర ప్రదేశములయందును నసంఖ్యాకముగా నింగ్లీషుచదువు విద్యార్థులకొఱకు కళాశాలలుకూడ స్థాపితములైనవి. కాని వీనియన్నింటికంటెను ముందుచెప్పిన రాజధాని కళాశాలయే విశ్వవిద్యాలయమున మొదటి కళాశాల యైనది. ఆఁనాటి కింకను తక్కినచోట్ల కళాశాల లేర్పడలేదు. కాఁబట్టియే చిన్నయసూరి మదరాసు విశ్వవిద్యాలయ ప్రధానాంధ్రపండితుఁ డయ్యెను.

అప్పుడుకూడ సూరిగారి కభిమానులగు ఆర్బత్ నాటు దొరవారే విశ్వవిద్యాలయ కళాశాలాధ్యక్షులుగా నుండిరి. వారియం దుండు నపారగౌరవముచేత చిన్నసూరి తన గ్రంథములను వారికే కృతియిచ్చియున్నారు. ఈ విధముగా మఱి నాలుగేండ్లకాలము చిన్నయసూరి అసమానసామర్థ్యముతో పండిత పదవిని నిర్వహించి క్రీ. శ. 1861 - వ సం|| డిసెంబరు నెలలో రాచపుండు కలుగుటచే నుద్యోగమునుండి విరమించి, 1862 మార్చి నెలలో కీర్తిశేషుఁ డయ్యెను.

చిన్నయసూరి రచనలు

చిన్నయసూరి యొక సాధారణమైన తెనుఁగుపండితుఁడే యైనను నాతని రచన లాంధ్రవాఙ్మయ ప్రపంచమున నాచంద్రార్కము నిలుచునవియై, యాతని కమరత్వమును సిద్ధింపఁ జేసినవి.