పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 32

వైయాకరణము రామానుజాచార్యులవారును కలిసి ముద్రించిన 'ఆంధ్ర మహాభారత' ప్రథమముద్రణ ముఖపత్రమున చిన్నయ యనియే వ్రాయఁబడియున్నది. 1847 చివరి భాగమునుండి యీపేరు ప్రసిద్ధి గాంచినది.

సూరి ప్రతిభా ప్రదర్శనము

దినదినప్రవర్థమానమగుచున్న చిన్నయసూరి కీర్తిని, ప్రతిష్ఠను అప్పటి సమకాలికు లగు పండితులు సహింప లేక, యీతఁ డాపదవి కసమర్థుఁ డని నిరూపించుటకు నొక పన్నాగమును పన్నిరి. గౌరవనీయులగు రంగనాథ శాస్త్రిగారి యింటియొద్ద నొక పండితసభ నేర్పాటుగావించి యకస్మాత్తుగా చిన్నయసూరి నచ్చటి కాహ్వానించిరి. రంగనాథ శాస్త్రిగారు న్యాయశాస్త్రమునందేకాక సంస్కృతభాష యందు, నితర శాస్త్రములయందు ప్రవీణత గలవారు. వీరికి పదునైదుభాషలలో పాండిత్య ముండెను. ఆకాలమున దేశభాషల విషయమై ప్రభుత్వమువా రీతనితోనే సంప్రతించుచుండిరి. అట్టివారి యధ్యక్షతక్రింద సూరిగారి నలంకార శాస్త్ర విషయమై యుపన్యసింపుమని కోరిరి. పండితుల కందఱకును సూరిగారికి వ్యాకరణమే కాని యలంకార మేమాత్రమును తెలియదను నభిప్రాయ ముండెడిది. ఉపన్యాసము ప్రారభించు సరికి మధ్యాహ్నము మూఁడుగంటలైనది. సూరి వేద కాలమునుండి యలంకారవిషయమును, దాని వ్యాప్తిని తెలియపఱచ నారంభించెను. గంగాప్రవాహమువలె నున్న యాతని యుపన్యాసధోరణి నాకర్ణించి సభాసదు లాశ్చర్యచకితులైరి.