పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 29

నింగ్లీషుభాష ప్రధాన భాషగా నుండి ఉత్తమ సాహితీపద్ధతుల పైని శిక్షణ గఱపఁబడుచుండుటచే దేశభాషాపండితులకుఁ గూడ కొంత యాంగ్లభాషాపరిచయము కలుగుట యావశ్యక మైనది. దీనికొఱకు క్రీ. శ. 1847 లో కేవల ప్రాచీనపండితులై యాంగ్లభాష నెఱుఁగని సీతారామశాస్త్రులవారి నాస్థానమునుండి తప్పించి, క్రొత్తపండితుని కొఱకు ప్రకటన గావించిరి. సీతారామశాస్త్రులవారు, తెనుఁగువా రాబాల గోపాలము ననవరతము నభ్యసింపఁదగిన, 'పెద్దబాలశిక్ష' యను గ్రంథమును 1849 లో రచించి ప్రకటించిరి. వీరే మొదట తెనుఁగువ్యాకరణమును ప్రశ్నోత్తరరూపముగా విద్యార్థులకు సులభముగా బోధపడునట్లు 'ప్రశ్నోత్తరాంధ్రవ్యాకరణము' అనుపేర రచించి క్రీ. శ. 1852 లో ప్రకటించిరి.

రాజధానీ కళాశాలాంధ్రపండితపదవి ప్రకటన వెలువడినతోడనే పండితులందఱును చిన్నయసూరిని ఈ పదవి నభ్యర్థించుచు నొక విజ్ఞాపనము నాకాలమున కళాశాల కధ్యక్షులును, రాజధాని విద్యాశాఖాదికారియు నగు శ్రీ A. J. అర్బత్‌ నాటు దొరగారికి పంపు మని ప్రోత్సహించిరి. చిన్నయసూరి యట్లే యొక విజ్ఞాపనపత్రమును పంపెను. కాని యీనాఁటివలెనాఁ డీపండితపదవు లధికారుల హస్తగతములు కావు. ప్రసిద్ధులగు విద్వాంసులసభలో పాండిత్యపరీక్షయం దభ్యర్థి యుత్తీర్ణుఁడైననే యీపదవి లభించెడిది. ఈ సూత్రము ననుసరించి చిన్నయసూరియు నట్టి విద్వత్సభాముఖమున తన యభ్యర్థిత్వము సమర్థించుకొనవలసివచ్చెను.