పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. రాజధానీ కళాశాల పండిత పదవి

చిన్నయసూరి వాఙ్మయ ప్రపంచమున చిరర్థాయియగు కీర్తిఁ బడయుటకు చెన్నపురి రాజధానీ కళాశాల పండిత పదవియే కారణభూతమైనది. కళాశాలలయందు పండిత పదవి యానాఁడు నేఁటివలె కేవలము సాహిత్య పాఠములకే సంబంధించినదికాదు. అంతకంటె నుత్కృష్టములగు న్యాయ శాస్త్రము, తర్కము, వ్యాకరణము విద్యార్థులకు బోధింప వలసిన యావశ్యకత యుండెడిది. చెన్న రాజధానిలో నీ కళాశాల పండిత పదవియొక్క చరిత్రము మనము పరిశీలించినచో చిన్నయసూరి కాలమునాఁటి కా పదవి యెట్టి గౌరవ పరిణామము పొందినదో గ్రహింపఁగలము. దీనికిముందు రాజధానీ కళాశాల తెలుఁగుశాఖ చరిత్ర తెలిసికొనుట యావశ్యకము.

చెన్నపురిలో కంపెనీ ప్రభుత్వమువారు క్రీ. శ. 1812 వ సంవత్సరమున ఫోర్టుసెంటుజార్జికోటలో నొక కళాశాలను స్థాపించిరి. దీనిలో ప్రభుత్వమున రాజకీయశాఖలో పనిచేసెడు నాంగ్లేయులకు మాత్రమే దేశభాషలగు తెలుఁగు, తమిళ భాషలలోను, భారతీయ భాషయగు సంస్కృతములోను శిక్షణ నిచ్చెడివారు. వారికేతప్ప స్వదేశీయుల కందు విద్య నేర్చుట కవకాశములేదు. మఱియు నాయుద్యోగులే న్యాయస్థానములలో తీర్పుచెప్పు అధికారము కలవారగుటచే హిందూ ధర్మ