పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


4. పచ్చయప్ప పాఠశాలా పండిత పదవి

చిన్నయసూరి పండితసభల కాహ్వానింపఁబడుట కవకాశము నాతఁడు పాఠశాలలో ప్రవేశించిన రెండవయేఁటనే తటస్థించినది. క్రీ. శ. 1837 - వ సంవత్సరమున విక్టోరియా చక్రవర్తినీపట్టాభిషేక మహోత్సవము లండను నగరమున జరిగెను. అప్పటికి హిందూ దేశమున ఈస్టిండియాకంపెనీవారి యధికారమే చెల్లుబడి యగుచున్నను నామె సామ్రాజ్యాధికారిణి గావున చెన్నపురినిగూడ నొక మహాసభ యేర్పాటు గావింపఁబడినది. ఆ సభయం దనేకులు విద్వాంసులు, విద్వత్కవులు విక్టోరియాచక్రవర్తిని నాశీర్వదించుచు రచనలను గావించిరి. తెనుఁగుభాషలో చిన్నయసూరి 'విక్టోరియాచక్రవర్తినీ మకుటాభిషేక మహోత్సవ పద్యరత్నము' లను పేర తొమ్మిదిపద్యములు రచించి చదివెను. అవి సభ్యులను విశేషముగా నాకర్షించినవి. నిశితమైన పాండిత్యప్రకర్షకుఁ దోడుగా నిరుపమాన మగు కవితారచనకూడ కలుగుటచే చిన్నయసూరి ప్రతిభ సర్వేసర్వత్ర వ్యాప్తిఁ జెందినది. ఆప్టనుపాఠశాల యందలి పండితపదవి యాతని పాండిత్యమునకు సరిపోయినది కాదనియు, నంతకంటె నున్నతమును, ప్రసిద్ధమును నగు స్థానము లభింపవలె ననియు ప్రజలు భావించుచుండిరి.