పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వజనుల కావశ్యమగు న్యాయశాస్త్ర గ్రంథమైనను చిన్నయసూరి దీనిని వ్యావహారిక భాషలోఁగాక గ్రాంథిక భాషలోనే రచించియున్నాఁడు. దీనికి కారణము గలదు. ఈ గ్రంథ రచనకు నేడేండ్లకు ముందు - కుంఫిణీ ప్రభుత్వము వారు వఠ్యం వాసుదేవ పరబ్రహ్మశాస్త్రియను పండితుని చేత జాస్ ఫ్రేయర్ థామసు దొరగారి కంకితముగా, జాస్ ఫ్రేయర్ థామస్ భూపాలీయము లేక 'వ్యవహార దర్పణము' అను గ్రంథమును రచియింపఁ జేసిరి. అది యంతయు వ్యావహారిక భాషలో రచితమైనది. అంతేకాక కేవల సంస్కృత భాషలోనున్న శాస్త్ర గ్రంథము లాధారముగా రచితమైనది చిన్నయసూరి గ్రంథము. ఆంగ్లేయ భాషలో థామస్ లుమిసిడన్ స్ట్రేంజి దొరగారు రచించిన A Manual of Hindu Law అను గ్రంథమునకు భాషాంతరీకరణము. కేవలము వ్యావహారిక భాషలోనున్న శాస్త్రియ విషయములను నిర్దుష్టముగ చెప్ప వలనుపడదు. ఈ సంగతి గ్రహించి, చిన్నయసూరి గ్రాంథిక భాషలోనే దీనిని రచించెను. వ్యావహారిక భాషా సౌలభ్యముతో, గ్రాంథిక భాషలో శాస్త్రీయ సాంకేతిక వివరణమును వ్రాసి, సుబోధన మొనరించిన చిన్నయసూరి ప్రతిభ ప్రశంసనీయము.

ఆంగ్లేయ భాషలోనున్న గ్రంథముల ననువదించుటకు చిన్నయసూరి ప్రథముఁడని చెప్పవచ్చును.