పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 13.

బాలురకు పాఠములుకూడ చెప్పెడివారు రామానుజాచార్యులవారి భార్య శ్రీనివాసాంబ. వారి కొక్క కొమరిత మాత్రమే యుండెడిది. ఆమె పెరిగి పెద్దదై వితంతు వయ్యెను. ఆ దంపతు లిరువురును పురుషసంతతి లేకపోవుటచే మిక్కిలి చింతించుచుండిరి. చాలకాలము గడిచినను వారి కోర్కె నెఱవేఱలేదు. తుట్టతుదకు వీరి మిత్రులగు శ్రీనివాసాచార్యుల వారు పుత్రోత్పత్తికొఱకు నొక యాగమును చేయించిరి. ఆ యాగపాయసమును భుజించినవెనుక నాదంపతులకు క్రీ. శ. 1806 ప్రభవసంవత్సరమున నొక పుత్రుఁడు జన్మించెను. అతఁడే మన కథానాయకుఁడు.

ఈతనికి తలిదండ్రులు 'చిన్నయ్య' యని నామకరణము కావించిరి. ఈ బాలునికి కుడికంటియందు నల్లగ్రుడ్డున్న స్థలము కొంచెము మాఱియుండెను. ఇది యొక శుభలక్షణ మని, దీనిని గలిగినవారు శాశ్వతమగు కీర్తిని సంపాదింతురని పెద్దలు చెప్పుచుండెడివారు. తలిదండ్రులును చాల కాలమునకు జన్మించిన పుత్రుఁడగుట చే నీతనిని మిగుల గారాబముతో పెంచుచుండిరి. ఈ కారణముచేత చిన్నయకు పదునాఱేండ్లు వచ్చువఱకు విద్యయం దాసక్తిగలుగుటకు నవకాశమే లేక పోయెను. ఇతఁడు తన తల్లితో పేరంటమునకు పోయి పాటలను పాడుచుండెడివాఁడు; ఇతర బాలురతో నాటపాటలతో కాలముఁబుచ్చెడివాఁడు.