పుట:2015.396258.Vyasavali.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజరాజు కాలమందున్న తెనుగుభాష

రాజరాజనరేంద్రునికాలమందు తెలుగుభాష ఎట్లుండెను? ఈ ప్రశ్న తక్కినవాటితోపాటు ఐతిహాసిక మండలివారి విచారణకు విషయము కాదగినదే. ఆరోజు రాజధాని " రాజమహేంద్రపురమే ” నేటి మన రాజమహేంద్రవరమన్నట్లు ఆనాటి తెనుగుభాషే ఈనాటి తెలుగున్ను అని అంటే సూక్ష్మదృష్టిలేని లోకులు అంగీకరించినా ఐతిహాసికమండలివారు తృప్తిపొంది ఊరుకోరు. కొంచెము ఆలోచించి చూస్తే ఎవరికైనా తోచకపోదు. రాజరాజు గూఢచారులకైనా పోల్చుకొనుటకు శక్యము కాకుండా అతని రాజధాని మారిపోయి నేటినగరమయి ఉన్నది. అతనికాలమందు నగరము సరిహద్దులు, వైశాల్యము, వీధులు, ఇండ్లు, కొలువుకూటము, రచ్చసావళ్లు, సత్తరువులు, అంగళ్ళు, పానశాలలు, కార్యస్థానములు, జనులు, వారి ఆచారవ్యవహారములు, వారి వృత్తులు, పురపరిపాలనము, విద్యలు, శాస్త్రములు, కళలు, పాఠశాలలు—ఇటువంటివిషయములు వేనవేలు విమర్శించి నేటిస్థితి కెన్ని నాటిస్థితికిన్ని గల సామ్యము వైషమ్యము తెలుసుకొంటేనేకాని వాస్తవముగా భూతార్థము నిశ్చయించలేము. రాజరాజునాటి నగరపటము నగరవర్ణనము, వ్యవహార ప్రదర్శని, వార్తాపత్రికలు, నవలలు మొదలయిన సామగ్రి దొరికితే విషయవిచారణ సుకరమవును గాని అట్టిసాధనములు లేవు. ఏదిఉంటే అది ఆధారము చేసికొని ఆకాలపుస్థితి తెలుసుకోవలెననే అభిలాష మనుష్యుల కందరికిన్ని సామాన్యమే, ఐతిహాసికులు సవిమర్శముగా విచారించి తెలిసికొనుటకు యత్నిస్తారు; సామాన్యులు వట్టిఊహలతో తృప్తిపొందుతారు. ఎవరికైనా ఇప్పటివారి వ్యవహారమునకు ఆధారముగా పూర్వకాలపు నగరస్థితి ఉండవలెననే ఉద్దేశము ఎంతమాత్రమున్ను లేదు.


ఈ వ్యానము రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచికనుండి పునర్మద్రితము.