పుట:2015.393685.Umar-Kayyam.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

47

183

జీవీకి నూత్నజీవకళఁ జేర్చెడు నీమధు వెంతొ పాత్రలో
నీవిఁక నింపి తెమ్ము ; విసిఁగింపక నాకరమందుఁ బెట్టు ; మీ
భూవలయంబు మిథ్య త్రుటి బోయినఁ బోవును జీవితంబు రాఁ
బోవదు వెండియున్ బగిలి పోయిన భాండచయంబు కైవడిన్.

184

ఱేపున కేరుఁ బూటపడి రిక్తులు గా రటుగాన నేఁడె సం
తాపములన్‌ద్యజింపుము సుధాంశునిభాన్య ! సుధాంశుఁడున్నయీ
మాపు విలాస మేర్పడఁగ మద్యముద్రావుము ; చంద్రుఁ డెప్పుడున్
గాఁపుర ముండు మింటను బ్రకాశముతో మన ముండినేర్తుమే.

185

ఆ మధుపాత్ర నాకరములందిడు ; నాహృదయంబు తప్తమై
యేమియుఁ దోఁచుకున్నది ? యిసీ ! రసమట్టుల పోవు నాయు ; వీ
భూమిని గల్మికై వగవఁ బోకుము ; లెమ్మిది స్వప్నతుల్య మో
భామిని ! యౌవనంబు మధుపానముచేతఁ బ్రశస్తి గాంచెడున్.

186

లెమ్ము మనోహరాంగి ! నట లీల భవన్ముఖకాంతిఁ జూపి తా
పమ్ము శమింపఁజేయు మధు పాత్రను గైకొని రమ్ము ! త్రావి హ
ర్షమ్మునఁ బాడుకొందము ; శరత్సమయం బిది జాగు చేయుచో
నిమ్మెయి మట్టిలోఁ గలిసి యేకలశమ్ములొ యౌదు మావలన్.